వైభవంగా జులూస్
● ఘనంగా దర్గా పీఠాధిపతి నగరోత్సవం
● కళ్లు చెదిరేలా బాణసంచా వెలుగులు
● ముగిసిన ఉరుసు మహోత్సవాలు
కడప సెవెన్‌రోడ్స్: ప్రముఖ సూఫీ పుణ్యక్షేత్రమైన పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. చివరిరోజు ఆదివారం రాత్రి దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నగరోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉదయం ఫకీర్లు, ఇతర శిష్య గణాలతో కలిసి పీఠాధిపతి పెద్దదర్గా నుంచి పెన్నానది తీరంలోని గండి వాటర్ వర్క్స్ కొండలోని గుహల వద్దకు వెళ్లి జెండా ప్రతిష్ఠించి ఫాతెహా నిర్వహించారు. తర్వాత ఆ ప్రాంతంలో హజరత్ మస్తాన్‌స్వామి స్మారకంగా అన్నదానం నిర్వహించారు. సాయంత్రం అక్కడి నుంచి ఊరేగింపుగా కడప నగరానికి తిరిగి వచ్చారు. పలు వాహనాలలో ఆయన శిష్యులు, ప్రముఖులు ఆయన వెంట ఊరేగింపులో పాల్గొన్నారు. రాత్రి మాసాపేటలోని హజరత్ మై అల్లా దర్గా షరీఫ్ వద్ద నుంచి పీఠాధిపతి ఫకీర్లు, సర్‌గిరోలు, చౌదరీలు, ఖలీఫాలు, శిష్య బృందం, నగర ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెంట రాగా నగరోత్సవం కొనసాగింది. విద్యుద్దీపాలు, పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంపై పీఠాధిపతి కొలువుదీరి ఊరేగింపుగా బయలుదేరారు. దాదాపు అన్ని కూడళ్లలో భక్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. బ్యాండు మేళాలకు అనుగుణంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా నృత్యాలు ప్రదర్శించి ఆనందించారు. అడుగడుగునా యువ కు ల బృందాలు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు పొందాయి. ఊరేగింపు తెల్లవారుజామున తిరిగి దర్గాకు చేరింది. అనంతరం ఊరేగింపుగా తెచ్చిన చాదర్‌ను గురువు మజార్‌పై సమర్పిచారు.
దర్గాలో సినీ నటుల ప్రార్థనలు
దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రముఖ సినీ నటులు సుమన్, హాస్యనటులు అలీ ఆదివారం కడపకు వచ్చారు. దర్గాను దర్శించుకుని గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి దర్గా ముజావర్ అమీర్ గురువుల చరిత్ర, విశిష్ఠతలను తెలియజేసి ప్రసాదాలు అందజేశారు.
వైభవంగా జులూస్
వైభవంగా జులూస్
వైభవంగా జులూస్


