పన్ను వసూళ్లలో పంచాయతీ కార్యదర్శి చేతివాటం
● ఇష్టారాజ్యంగా పన్ను విధింపు
● ఆన్‌లైన్ బిల్లు కాకుండా మ్యానువల్ రసీదులు
● ఫోన్ పేతో నేరుగా లావాదేవీలు
● సెక్రటరీ అక్రమాలపై
డిప్యూటీ ఎంపీడీఓతో విచారణ
మదనపల్లె రూరల్ : పన్ను వసూళ్లలో పంచాయతీ కార్యదర్శి చేతివాటాన్ని ప్రదర్శించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి సొంత జేబులు నింపుకున్న ఘటన కోళ్లబైలు పంచాయతీలో వెలుగుచూసింది. పట్టణానికి ఆనుకుని, వేలసంఖ్యలో ప్రభుత్వ ఇళ్లు, విలువైన భూములు కలిగిన కోళ్లబైలు పంచాయతీలో పేదల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సెక్రటరీ లక్షల రూపాయల అక్రమార్జనకు పాల్పడింది. పంచాయతీ వ్యవస్థలో నూతనంగా తీసుకువచ్చిన స్వర్ణ పంచాయత్ యాప్ ద్వారా వసూళ్లు చేయాల్సి ఉండగా, ప్రభుత్వ నిబంధనలు కాదని, మ్యానువల్ రసీదుల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలుచేసి జేబులు నింపుకుంది. కోళ్లబైలు పంచాయతీ సెక్రటరీ మంజుల నిర్వాకంపై బాధితులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపి, డీఏఓ నిర్మలాదేవికి ఫిర్యాదుచేశారు. పంచాయతీలోని ఇళ్లకు ఒకో ఇంటికి ఒకోలా పన్నులు విధించడమే కాకుండా మ్యుటేషన్, టైటిల్ ట్రాన్స్‌ఫర్, న్యూ అసెస్‌మెంట్ సర్వీస్ పేరుతో అదనపు వసూళ్లు చేసి ప్రభుత్వ ఖజానాకు జమచేయలేదు. స్వర్ణ పంచాయతీ యాప్ క్యూఆర్ కోడ్ విధానంలో పన్ను వసూలుచేయాల్సి ఉండగా, ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా తన సొంత ఫోన్ పే నెంబర్‌కు పన్ను నగదును బదిలీ చేయించుకుంటోంది. పంచాయతీ కార్మికులకు ఆన్‌లైన్ ద్వారా వారి వ్యక్తిగత ఖాతాలకు వేతనాలు జమచేయాల్సి ఉండగా, అందుకు వ్యతిరేకంగా నేరుగా జీతభత్యాలను ఆన్‌లైన్ మొత్తం కంటే తక్కువగా నగదు రూపంలో చెల్లిస్తోంది. కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి రికార్డుల్లో మాత్రం పూర్తిగా చెల్లించినట్లు నమోదుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 రోజులుగా వసూలుచేసిన పన్నుల మొత్తం, బ్యాంకుకు జమచేయకుండా తన వద్దే ఉంచుకోవడంపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. టైటిల్ ట్రాన్స్‌ఫర్‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 వసూలు చేయాల్సి ఉండగా, 9వేల రూపాయలు తీసుకుని ఆన్‌లైన్ రసీదు కాకుండా మ్యానువల్ రసీదులు ఇచ్చింది. స్థానికులు ఎవరైనా పంచాయతీ సెక్రటరీ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే...తనకు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నతాధికారి తనకు బాగా పరిచయస్తుడని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, అహంకార ధోరణితో ప్రజలతో అమర్యాదగా ప్రవర్తిస్తోందని తెలిపారు. కోళ్లబైలు పంచాయతీ సెక్రటరీ మంజుల అక్రమాలపై, బహుజనయువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్, స్థానికులతో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ తాజ్‌మస్రూర్ స్పందిస్తూ...పంచాయతీ సెక్రటరీ మంజుల అక్రమ వసూళ్లు, మ్యానువల్ రసీదులు, వసూళ్లు ప్రభుత్వ ఖజానాకు జమచేయకపోవడం తదితర అంశాలపై డిప్యూటీ ఎంపీడీఓ భారతిని విచారణ అధికారిగా నియమిస్తున్నామన్నారు. ఆమె నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు చర్యలకు సిఫారసు చేస్తామన్నారు.


