దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
వడ్డీ వ్యాపారిపై హత్యకేసు నమోదు
మదనపల్లె రూరల్ : వడ్డీ వ్యాపారి దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, దాడి కేసును హత్యకేసుగా నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మండలంలోని కొండామర్రిపల్లె పంచాయతీ ఇసుకనూతిపల్లెకు చెందిన శ్రీనివాసులు భార్య ప్రభావతి(40) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న రవి వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత నగదు అప్పుగా తీసుకుంది. సమయానికి తిరిగి వడ్డీ చెల్లించలేకపోవడంతో రవి ఆమెను దూషించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె అక్టోబర్ 30న పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయమై ఆమె భర్త శ్రీనివాసులు అక్టోబర్ 31న వడ్డీ వ్యాపారి రవిని ప్రశ్నించాడు. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో రవి, శ్రీనివాసులుపై దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టాడు. ఘర్షణలో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయం కాగా, స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు దాడి కేసును హత్యకేసుగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.


