మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: కార్తీకమాసం పురస్కరించుకుని తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 5, 5.45, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు.
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 10వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఈసందర్భంగా భక్తుల అమ్మవారికి ఉదయాన్నే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం.
మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణం బెంగళూరుబస్టాండు సమీపంలోని హజరత్ సైదాని మా (బడేమకాన్) ఉరుసు ఉత్సవాలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు దర్గా మకాన్‌దార్ సయ్యద్‌హాషిం తెలిపారు. 11వతేదీ సందల్, 12వతేదీ ఉరుసు,ఖవ్వాలి, 13వతేదీ తహలీల్‌ఫాతెహా, ఖవ్వాలి జరుగుతాయన్నారు. ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. హిందు ముస్లిం సోదరులు ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
చిన్నమండెం: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలో ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి చిన్నమండెం మండలం దేవగుడిపల్లి గ్రామం సమీపంలో ఏర్పాట్లను పరిశీలించారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డితో కలిసి పలు విషయాలపై వారు చర్చించారు.
రాయచోటి: బాలికల ఎదుగుదలకు ప్రేరణగా నిలుస్తున్న గైడ్ కెప్టెన్లు ధైర్య సాహసాలకు ప్రతీక అని, నవ సమాజ నిర్మాతలని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) రాష్ట్ర సంచాలకుడు డి దేవానందరెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి పట్టణం డైట్‌లో ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు ఏడురోజులపాటు నిర్వహించిన గైడ్ కెప్టెన్ల బేసిక్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే క్రమశిక్షణతోపాటు దేశభక్తి, సామాజిక సేవా భావాలను పెంపొందించడానికి బాలభటుల ఉద్యమం తోడ్పడుతుందని అన్నారు. బాలికల్లో సేవాభావం, క్రమశిక్షణ, ధైర్యం, సాహసం వంటి మానవీయ విలువలను పెంపొందించడంలో గైడ్ కెప్టెన్ల పాత్ర ఎనలేనిదన్నారు. అనంతరం పీటీఎం మండలం, కమ్మచెరువు హైస్కూల్ ప్రధానోపాధ్యాయిని లలిత రూ. 10 వేలు చెల్లించి స్కౌట్ జీవిత సభ్యురాలుగా చేరడం గొప్ప విషయమన్నారు. లీడర్ ఆఫ్ ది కో ర్సు కస్తూరి సుధాకర్, జిల్లా సెక్రటరీ ఎం నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, ఆపదమిత్ర నోడల్ ఆఫీసర్ గురునాథరెడ్డి, జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన 57 మంది బేసిక్ గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు.


