
నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు
ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన, ధర్నా
అనంతరం అధికారులకు డిమాండ్ పత్రాల అందజేత
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తారు.
నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యంవల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరనున్నారు.
ఇక వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దుచేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సిఫార్సు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తారు.