
పోలీస్ స్టేషన్‌లో కేకే రాజు, తైనాల విజయకుమార్ తదితరులు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సహా 13 మందిపై తప్పుడు కేసులు
ప్రజల కోసం పోరాడితే అరెస్టులతో వేధింపులు
అల్లిపురం(విశాఖ జిల్లా): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గత నెల 23న జరిగిన యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న 13 మంది నాయకులపై విశాఖ మహారాణిపేట పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ అధ్యక్షుడు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కోలా గురువులు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు తదితర నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మహారాణిపేట పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి, ష్యూరిటీలు సమరి్పంచి, స్టేషన్ బెయిల్‌పై వచ్చారు.
నిరసన తెలిపినా తప్పేనా?
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, నిరుద్యోగ భృతి అందించకుండా మోసగించిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయనందుకు నిరసనగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ‘యువత పోరు‘పేరిట నిరసన తెలిపినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో జీరి్ణంచుకోలేని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని ఆరోపించారు.
పోలీసులు జారీ చేసిన నోటీసులను గౌరవించి స్టేషన్‌కు స్వయంగా వచ్చి ష్యూరిటీలు సమర్పించామన్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కేకే రాజు వెంట డిప్యూటీ మేయర్ కటుమూరి సతీశ్ , పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, ఉరుకూటి అప్పారావు, ఫ్లోర్ లీడర్ బానాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు పి.వి.సురేష్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు సేనాపతి అప్పారావు, రాయపురెడ్డి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.