11న విశాఖకు ప్రధాని మోదీ రాక 

YSRCP Leader Vijayasai Reddy On PM Narendra Modi Visakha Tour - Sakshi

రెండు రోజులపాటు పర్యటన 

అభివృద్ధి పనులకు శ్రీకారం.. బహిరంగ సభలో ప్రసంగం

ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్‌సీపీపీ నేత విజయసాయిరెడ్డి

సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11, 12 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రధాని బహిరంగసభ కోసం ఎంపిక చేసిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌ను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, వీసీ ప్రసాదరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని కార్యక్రమాలన్నీ పీఎంవో ఖరారు చేసిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ప్రధాని 11న విశాఖ చేరుకుని రాత్రి ఇక్కడే బస చేస్తారని, 12న ఉదయం బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. రైల్వే జోన్‌పై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ బదులిస్తూ.. దానిపై ఇప్పటికే రైల్వే మంత్రి స్పష్టమైన సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు.

రాజకీయ విమర్శలొద్దు
ప్రధాని మోదీ రాకపై రాజకీయ విమర్శలు వద్దని.. పార్టీలకు అతీతంగా ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. ప్రధాని పర్యటన పార్టీలు, రాజకీయాలక తీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కార్యక్ర మమని చెప్పారు. ఈ సందర్భంగా రూ.12 వేల కోట్ల విలువైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అంతా సంతోషించా ల్సిన విషయమన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనతోపాటు పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాస్, మరికొందరితో కమిటీని నియమించారని తెలిపారు.

బహిరంగసభ వేదికపై ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని పీఎంవో, ఎస్పీజీ అధికా రులే నిర్ణయిస్తాయని చెప్పారు. ఎస్పీజీ అనుమతిస్తే ప్రధాని వచ్చేమార్గంలో విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ జెండాలతో అభివాదం చేస్తూ స్వాగతం పలుకుతారని చెప్పారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావడం తథ్యమని, దానిని ఎవరూ ఆప లేరని ఆయన పునరుద్ఘాటించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమన్నారు. వైఎస్సార్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్య మన్నారు.

బీజేపీ అగ్రనాయకత్వానికి వైఎస్సార్‌సీపీ సన్నిహితంగా ఉందని తెలియజెప్పడానికే విశాఖ లో ప్రధాని పర్యటనను ఖరారుచేశారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కోర్టు తీర్పు అనంతరం భోగాపురం విమానాశ్రయానికి  శంకు స్థాపన జరుగుతుందని వెల్లడించారు. సమావే శంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయు డు, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు పాల్గొన్నారు. 

రూ.10,472 కోట్ల పనులకు శ్రీకారం
ఈ నెల 12న రూ.10,472 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని కలెక్టర్‌ మల్లికార్జున తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునికీకరణ, రాయపూర్‌–విశాఖపట్నం 6 లేన్ల రహదారి, కాన్వెంట్‌ జంక్షన్‌–షీలానగర్‌ పోర్టు రోడ్డు అభివృద్ధి, విశాఖ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ, గెయిల్‌కు సంబంధించి శ్రీకాకుళం–అంగుళ్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు, నరసన్నపేట–ఇచ్ఛాపురం రోడ్డు అభివృద్ధి, ఓఎన్‌జీసీ ఆఫ్‌షోర్‌ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top