
సాక్షి, తిరుపతి: మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్ మెన్ కాలేశా తొలగింపుపై వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీ మణికంఠ ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘రెండు నెలలు క్రితం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయికి ఫ్యాక్చర్ అయ్యింది. చేయి గాయం కారణంగా గన్ మెన్ కాలేశా ఔదార్యపూరితమైన పెద్దిరెడ్డికి సహాయం చేశాడు. జైలు పరిసర ప్రాంతాల్లో ఇతరులను ఎవరిని అనుమతించరు. అందుకే పెద్దిరెడ్డితో పాటుగా గన్‌మెన్.. మిథున్ రెడ్డి ఉన్న జైలుకు వెళ్లారు. మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును పెద్దిరెడ్డి మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ మణికంఠ.. కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఇలా చేయడం సరికాదు.
ఎస్పీ ఆఫీసు, బంగ్లాలో అనధికారికంగా ఎంతో మంది పని చేస్తున్నారు. తప్పు చేసిన వారిని క్షమించనని చెప్పిన ఎస్పీ మణికంఠ.. ఆదర్శంగా నిలవాలి. అనాధికారికంగా కానిస్టేబుల్స్‌తో ఎస్పీ కార్యాలయం, బంగ్లాతో పనిచేయిస్తున్నారు. ఎస్పీ వెంటనే వారిని తొలగించి ఆదర్శంగా ఉండాలి. ఆత్మ న్యూనత భావంతో పనిచేయకండి. కాలేశా సస్పెండ్ కరెక్ట్ అయినప్పుడు.. మిగతా వారిని కూడా సస్పెండ్ చేస్తారా?.
ఇదిలా ఉండగా.. చిత్తూరు ఎస్పీ మణికంఠ వ్యవహారశైలి మరోమారు వివాదస్పదమయ్యింది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ రూట్ మ్యాప్ అప్పటికప్పుడు మారుస్తూ, ఆంక్షలు విధించిన ఎస్పీ.. తాజాగా రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి గన్‌మేన్ కాలేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం కేసులో అరెస్టయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి రాజమండ్రి జైల్లో ఉండగా, రెండు రోజుల క్రితం ఆయనను పరామర్శించడానికి రామచంద్రారెడ్డి వెళ్లారు.

ఇటీవల పెద్దిరెడ్డి చేయి విరగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డికి ఇంటి భోజనం తీసుకెళ్లే బ్యాగు, తల దిండును ఆయన మోయలేకపోవడంతో.. దాన్ని గన్‌మేన్ కాలేషా తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ, కాలేషాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మానవతాదృక్పథంతో బ్యాగు తీసుకున్నందుకు తనను సస్పెండ్ చేయడం తగదని కాలేషా వేడుకున్నా.. అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఇక గతేడాది జూలైలో ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు పర్యటన సందర్భంలో అక్కడ టీడీపీ శ్రేణులు అల్లర్లకు పాల్పడి, కార్లకు నిప్పంటించారు. మిథున్‌రెడ్డిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటడంతో మిథున్‌రెడ్డి గన్‌మేన్ గాల్లో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీనిపై ఆగ్రహించిన ఎస్పీ నాడు మిథున్‌రెడ్డి గన్‌మేన్‌ను సైతం సస్పెండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్దిరెడ్డి కుటుంబమే లక్ష్యంగా ఎస్పీ మణికంఠ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.