జగనన్న సర్కార్‌ అండతో పెరిగిన పరపతి

YSR Sunna Vaddi, YSR Asara Scheme Benefit Women SHGs in Anantapur District - Sakshi

ఆర్థిక స్వావలంబన దిశగా అక్కచెల్లెమ్మలు

మూడేళ్లలో రూ.5,423 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణం

వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా రూ.387.01 కోట్ల లబ్ధి

స్వయం సహాయక సంఘాల రుణ రికవరీ 99.62 శాతం

ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, ఎవ్వరూ బ్యాంకులకు కంతులు చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మహిళలు మోసపోయారు. అప్పటి వరకు సక్రమంగా కంతులు చెల్లించిన వారు ఒక్కసారిగా డీఫాల్టర్లుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఎన్నికలకు ముందు వరకు బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ‘వైఎస్సార్‌ ఆసరా’ కింద విడతల వారీగా సంఘాలకు చెల్లించింది. ప్రభుత్వ చేయూత ద్వారా మహిళలు అప్పులు తీర్చేశారు. బ్యాంకులతో కొత్తగా రుణాలు ఇప్పించడంతో పాటు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. సంఘాల సభ్యులు సక్రమంగా కంతులు చెల్లించడం ద్వారా అగ్రపథంలో నిలిచి పరపతి పెంచుకున్నారు.

అనంతపురం అర్బన్‌: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై బ్యాంకులకు అపార నమ్మకం. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో తీరుస్తుండటమే ఇందుకు కారణం. సంఘాలు అడిగిన వెంటనే బ్యాంకులు రూ.కోట్లలో రుణం మంజూరు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు జగనన్న సర్కార్‌ వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన మూడేళ్లలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా బ్యాంకులు రూ.5,423 కోట్ల రుణం మంజూరు చేశాయి.

99.62 శాతం రుణ చెల్లింపు
స్వయం సహాయక సంఘాలకు గడిచిన మూడేళ్లలో బ్యాంకులు రూ.5,423 కోట్లు రుణం మంజూరు చేస్తే అందులో సగటున 99.62 శాతం చెల్లింపులు జరిగాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 47,358 సంఘాలకు బ్యాంకులు రూ.1,587 కోట్ల రుణం మంజూరు చేస్తే 99.61 శాతం చెల్లించారు. 2020–21లో 59,849 సంఘాలకు రూ.1,726 కోట్ల రుణం ఇవ్వగా చెల్లింపులు 99.60 శాతం ఉన్నాయి. 2021–22లో 55,221 సంఘాలకు రూ.2,110 కోట్లు రుణం మంజూరు చేస్తే చెల్లింపులు 99.65 శాతం జరిగాయి. 

రూ.387.01 కోట్ల సున్నా వడ్డీ
స్వయం సహాయక సంఘాలు నిర్వహించుకుంటూ ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది. వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.137.72 కోట్లు, 2020–21లో రూ.118.35 కోట్లు, 2021–22లో రూ.130.25 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.


సీఎంకు రుణపడి ఉంటాం

మహిళల అర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. మా సంఘం ద్వారా ప్రతిసారి రూ.5 లక్షల రుణం తీసుకుంటున్నాం. సకాలంలో కంతులు కడుతున్నాం. మేము తీసుకున్న రుణానికి వడ్డీని ప్రభుత్వం సున్నావడ్డీ పథకం ద్వారా చెల్లిస్తోంది. ఇదే కాకుండా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు. 
– సునీత, సత్యసాయి మహిళా సంఘం, అనంతపురం


సక్రమంగా చెల్లిస్తున్నాం

మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాము. ఇటీవలనే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. తొలి నుంచి కంతులు సక్రమంగా చెల్లిస్తుండడంతో అడిగిన వెంటనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తున్నారు. ఈ అప్పు తీరిన వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. సున్నావడ్డీ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది.            
– సుమంగళమ్మ, నైథిలి మహిళా సంఘం, బ్రహ్మసముద్రం


రికవరీ సంతృప్తికరం

మహిళలు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో వారు అడిగిన వెంటనే బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రుణాల రికవరీ 95 నుంచి 99 శాతంతో సంతృప్తికరంగా ఉంది. సంఘాలకు రుణం మంజూరు, చెల్లింపు విషయంలో సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. దీంతో చెల్లింపులు బాగుంటున్నాయి. 
– బి.నాగరాజరెడ్డి, ఎల్‌డీఎం


బాధ్యతగా రుణ చెల్లింపులు

బ్యాంక్‌ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు బాధ్యతగా చెల్లిస్తున్నారు. ఏటా లక్ష్యానికి మించి బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఏదేని సంఘం రుణం సకాలంలో చెల్లించకపోతే అది సున్నావడ్డీ పథకానికి అర్హత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో రుణం మంజూరు చేయించడంతో పాటు వారు సక్రమంగా చెల్లించే విషయంలో సెర్ప్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.   
– ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్‌


బ్యాంకుల సంపూర్ణ సహకారం

పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణం మంజూరు చేయడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. రుణం తీసుకున్న సంఘ సభ్యులూ బాధ్యతగా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇక నారీశక్తి కింద మహిళలకు యూనియన్‌ బ్యాంక్‌ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 
– విజయలక్ష్మి, పీడీ, మెప్మా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top