తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆక్వా రైతులు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు
నెలాఖరే గడువు.. జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన
చంద్రబాబు సర్కార్‌కు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ రూ.3.85
ఇక ఇప్పుడు జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపుల బెదిరింపు
వారం క్రితం ఇచ్చిన జీవో ఆర్‌టీ 169 క్లాజ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్
ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్రలు
అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరల పెంపు
వనామీ ఫీడ్‌పై కేజీకి రూ.10... టైగర్‌పై కేజీకి రూ.12 వడ్డన
మరి ఇప్పుడు ఇది ఏ ట్యాక్స్?.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?
ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్‌లో సిండికేట్ మొత్తం ఒకే వర్గం.. బాబుకు దగ్గరివారే
మా హయాంలో ఆక్వా రంగానికి పూర్తి అండ.. రక్షణ కవచంలా ‘అప్సడా’
యూనిట్ విద్యుత్ రూ.1.50కే.. మేనిఫెస్టోలో పెట్టాం.. అమలు చేశాం
57 నెలల్లో ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.3,306 కోట్లు ఇచ్చాం
ఆక్వా కోసం తీర ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్
ఆర్బీకేల్లో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్ల నియామకం
నాడు ఏపీకి స్కోచ్ అవార్డు, బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డ్
రొయ్యల ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీని నెంబర్ వన్‌గా నిలిపాం
ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020 అమలు
ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు
జగన్‌కు సమస్యలు చెప్పుకున్న ఆక్వా రైతులు, ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు
వారి సమస్యలను సావధానంగా విని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దారుణంగా పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేని పక్షంలో వచ్చే నెల 1 లేదా 2వతేదీన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని చంద్రబాబు సర్కార్‌కు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. 2019–24 మధ్య ఆక్వా రంగానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, 57 నెలల్లో ఆక్వా విద్యుత్ సబ్సిడీ కింద రూ.3,306 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదే యూనిట్ విద్యుత్‌కు 2014–19 మధ్య రూ.3.85 చొప్పున వసూలు చేసిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.2కే అంటూ జీవోతో సరిపుచ్చి అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
జోన్ లోపల రైతులకు సబ్సిడీ కత్తిరింపులపై బెదిరిస్తున్నారని.. ఆ దిశగా వారం క్రితం జీవో ఆర్‌టీ 169 జారీ చేశారని.. క్లాజ్ నెం 4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) నిర్వహణపై రూల్ పెట్టారని దుయ్యబట్టారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము అప్పుడైనా, ఇప్పుడైనా.. ఎప్పుడూ ఆక్వా రంగానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. ఆక్వా రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు.. ఫిషరీస్ అసిస్టెంట్లు.. అప్సడా
ఈరోజు అత్యంత దారుణ స్థితిలో రైతులు, ఆక్వా రైతులు ఉన్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన హయాంలో రైతులు, ఆక్వా రైతుల సంతోషం కోసం చాలా ఆలోచన చేశాం. అందుకే గతంలో ఏనాడూ చూడని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. 10 వేలకు పైగా ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వాటిలో 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్స్‌ను నియమించాం. ఆక్వా సాగులో నాణ్యతతో కూడిన సీడ్, ఫీడ్ టెస్టింగ్ కోసం 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు, 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు, వీటికి తోడు అప్సడా ఏర్పాటు చేశాం. సీఎం దానికి ఛైర్మన్‌గా ఉంటూ ఎక్కడా సిండికేట్ ఏర్పాటు కాకుండా, రైతులకు ద్రోహం జరగకుండా చూశాం.
రూ.1.50కే యూనిట్ విద్యుత్..
యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చి ఆక్వా రంగాన్ని ఆదుకున్నాం. అందుకోసం రూ.3,306 కోట్లు ఖర్చు చేశాం. మనం ఆ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాక.. చంద్రబాబు యూనిట్ విద్యుత్ రూ.3.85 నుంచి రూ.2కి తగ్గిస్తానని ఆదేశాలు జారీ చేసినా అమలు మాత్రం చేయలేదు. అక్కడా విద్యుత్ సబ్సిడీ రూ.340 కోట్లు ఎగ్గొట్టాడు.
అవార్డులు, భారీగా ఎగుమతులు.. రూ.వంద కోట్లతో ఆక్వా వర్సిటీ..
మన హయాంలో ఆక్వా రంగానికి అన్ని విధాలుగా తోడుగా నిలవడం ద్వారా ఆక్వా సాగు ఒక పండగలా సాగింది. దీంతో డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు కూడా దక్కాయి. నాడు ఆక్వా ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్యలు, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగాయి. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు.. ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. అలా ఆ ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. అంతకు ముందు చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇవన్నీ జరిగాయి. అందుకే ఆక్వా వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. రూ.100 కోట్లు కేటాయించి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. తాత్కాలిక భవనాల్లో క్లాస్‌లు కూడా మొదలు పెట్టించాం. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది.
నెలాఖరులోగా ధరలు తగ్గించాల్సిందే
ఫిబ్రవరి నుంచి జూన్ నాటికి కిలో ఫీడ్ దాదాపు రూ.16 వరకు పెరిగింది. ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికల్లా ధరలు తగ్గించాలి. లేని పక్షంలో జూలై 1 లేదా 2న ఆక్వా రైతులతో కలిసి ఆందోళన చేస్తాం. రాష్ట్రమంతా చూసేలా సమస్యను ఎలుగెత్తి చాటుదాం. అప్పటిలోగా ఫీడ్ రేట్లు తగ్గిస్తారేమో చూద్దాం. అప్పటి వరకు వారికి టైమ్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది. రేట్లు తగ్గించకపోతే ఆరోజు ఆక్వా రైతుల సమస్యలు యావత్ దేశం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నిద్దాం. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు క్రాప్ హాలీడే కూడా ప్రకటించుకోలేని పరిస్థితి. అలా చేస్తే ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాలు, ఉపకరణాలు తుప్పు పట్టి పోతాయి. చెరువులు తవ్వారు కాబట్టి ఆ భూములు ఎందుకూ పనికిరావు.
3 సార్లు ఉపసంహరించేలా చర్యలు..
నాడు ‘అప్సడా’ ద్వారా సిండికేట్ ఆట కట్టించడమే కాకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచితే మూడుసార్లు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నాం. థాయ్‌లాండ్‌కు చెందిన సీపీఎఫ్ కంపెనీ ఒకేసారి కిలోకు రూ.6.8 పెంచడానికి సిద్ధపడితే ఆక్వా రైతులు మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారిని పిలిపించి ధరల పెంపును విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే ఫీడ్ యాక్ట్ ప్రయోగిస్తామని నోటీస్ ఇవ్వడంతో దారికొచ్చారు. ఆ విధంగా ఆక్వా రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేశాం. ఇప్పుడు ఆక్వా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. వారంతా ఆయనకు సన్నిహితులు. అందుకే వారిపై ఎలాంటి చర్యలు లేవు.
రొయ్యల ధరలపై నిరంతర సమీక్ష
నాడు ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతి రైతుకూ ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా చేశాం. 100 కౌంట్ రొయ్యలు రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యలు రూ.470 చొప్పున కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాం. ఇప్పుడు రొయ్యల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కానీ రొయ్యల ధరలు పెరగకపోగా తగ్గాయి. దీంతో ఆక్వా రైతులు నష్టాల పాలవుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్ వడ్డి ర«ఘురాంనాయుడు, పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజుతో పాటు ఏపీ ప్రాన్ ఫెడరేషన్ ప్రతినిధులు ఐపీఆర్ మోహన్‌రాజు, దుగ్గినేని గోపీనాథ్, జి.రాజ్‌కుమార్, నడింపల్లి సూర్యనారాయణరాజు, ఆర్.వెంకటరాజు, జి.ధర్మరాజు, కె.శ్రీనాథ్‌రెడ్డి, మేకా వెంకటేశ్వరరావు, కె.సుబ్బారెడ్డి, రమేష్‌రెడ్డి, సీహెచ్ కుమార దత్తాత్రేయవర్మ, జి.నారాయణమూర్తి, కె.నరసింహారావు, గుంటూరి పెద్దిరాజు, ఎ.చల్లారావు, బొక్కా రాధాకృష్ణతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మరి ఇది.. సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్ ట్యాక్సా?
నాడు ఆక్వా ఫీడ్ కొంచెం పెరిగితే అది జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చాలా దారుణంగా రేట్లు పెంచారు. మరి ఇది ఏ ట్యాక్స్? ఎవరికి పోతోంది? ఈరోజు మీరు (ఆక్వా రైతులు) నన్ను కలుస్తున్నారని తెలియడంతో ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు తాము ధర ఎందుకు పెంచాల్సి వచ్చిందో చెబుతూ పేపర్‌లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు అంతా సిండికేట్‌గా మారారు. అంతా కూడబలుక్కుని ఇష్టానుసారం రేట్లు పెంచారు. చేపలవేట నిషేధ సమయంలో ధరలు సమీక్షిస్తున్నారు. ఆ సాకు చూపి ఫీడ్ రేటు పెంచుతున్నారు. అది సరైన విధానం కాదు. ఫిషరీ సంపద ఎక్కువగా ఉన్నప్పుడు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. ఆక్వా ఫీడ్, సీడ్ రంగంలో సహకార వ్యవస్థ వస్తే ఇలా సిండికేట్‌గా మారడం, దోపిడీ చేయడం సాధ్యం కాదు.

మనం డెయిరీ రంగంలో అమూల్‌ను తీసుకురావడం వల్ల పాడి రైతులకు ఎంతో మేలు జరిగింది. అంతకు ముందు ప్రభుత్వంలో సిండికేట్ కావడం వల్ల ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మన ప్రభుత్వం రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేయడంతో పాటు వారికి తోడుగా నిలిచేలా ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా) ఏర్పాటు చేశాం. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020 అమలు చేసి ఆక్వా కంపెనీలు రైతులకు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ‘అప్సడా’ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో అప్సడా ఆమోదం, అనుమతి లేకుండా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. వనామీ ఫీడ్‌పై కేజీకి రూ.10, టైగర్‌పై కేజీకి రూ.12 చొప్పున పెంచారు. మరి ఇప్పుడు ఏ ట్యాక్స్ పడింది? సీబీఎన్ ట్యాక్సా? లోకేశ్‌ట్యాక్సా? వెంటనే పెంచిన ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలి.
బాబు బంధువులే ఉత్పత్తిదారులు
టీడీపీ కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి శాపంలా మారింది. పీఎఫ్ ఫ్యాక్టర్‌తో ఆక్వాకు విద్యుత్ సబ్సిడీ ఎత్తివేసే కుట్ర జరుగుతోంది. గతంలో ఆక్వాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదు. మీరు (వైఎస్ జగన్) వచ్చాకే విద్యుత్ సబ్సిడీతో పాటు అప్సడా ఏర్పాటు ద్వారా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు బంధువులే ఆక్వా సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు. అందుకే ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు.
– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు
జీవామృతంలా అప్సడా ఏర్పాటు
ఆక్వా రైతులకు జీవామృతంలా వైఎస్ జగన్ ‘అప్సడా’ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అప్సడాను బైపాస్ చేసి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. వేట నిషేధ సమయంలో ఫిష్ మీల్ రేట్లు పెరుగుతాయి. దాన్ని బూచిగా చూపించి రేట్లు పెంచుతున్నారు. ఫీడ్ కంపెనీలకు సపోర్టు వ్యవస్థ ఉన్నప్పటికీ రైతులను దోచుకు తింటున్నారు. తద్వారా రైతులు రూ.10 వేల కోట్లు నష్టపోతున్నారు. రైతులను దోచుకునే విధానాలకు ముగింపు పలకాలి. కోవిడ్ సమయంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థంగా వ్యవహరించింది. లోకల్ మార్కెట్ పెంచడానికి ఫిష్ ఆంధ్రా కార్యక్రమం చాలా ఉపయోగపడింది.
– ఐపీఆర్ మోహన్‌రాజు, భీమవరం
ఫిబ్రవరి నుంచి రెండుసార్లు పెంచారు
ఆక్వా ఫీడ్ ధర ఫిబ్రవరిలో టన్నుకు రూ.4 వేలు పెంచారు. మళ్లీ ఈనెల 13న రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. వంద కౌంట్ రొయ్యలకు పెట్టుబడి ఖర్చు రూ.275 అయ్యింది. నెల క్రితం వరకూ రూ.250కు కొనుగోలు చేశారు. ఫీడ్ ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో ఇప్పుడు రూ.225కు తగ్గించేశారు. నాడు వైఎస్ జగన్ రాకముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు కరెంట్ సబ్సిడీ రూపాయిన్నరకు ఇవ్వడంతో రైతులు పండుగ చేసుకున్నారు. – జి.శ్రీనాథ్‌రెడ్డి, నెల్లూరు జిల్లా
కోవిడ్‌లోనూ సరుకు అమ్ముకున్నాం
వైఎస్ జగన్ ఆక్వా రైతులకు అప్సడా ద్వారా రక్షణ కవచం ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయంలో మా పంట ఎవరూ కొనకపోతే జగన్ ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేయించింది. ప్రాసెసింగ్ ప్లాంట్ల సిండికేట్ ఆగిపోయింది. సీడ్ కారణంగా రైతులు నష్టపోతే సంబంధిత కంపెనీలను పిలిపించి మళ్లీ సీడ్ ఉచితంగా ఇప్పించారు. అంతర్జాతీయ కంపెనీ సీపీఎఫ్ ఛైర్మన్‌నే రాష్ట్రానికి రప్పించి ఫీడ్ ధరలు తగ్గించారు. ఫిబ్రవరిలో అప్సడా అనుమతి లేకుండా కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ రేట్లు పెంచాయి. మళ్లీ మే 11న ఫీడ్ ధరలు పెంచారు. రైతుల అభ్యంతరాలను పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెచ్చిన చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మేం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాం.
– దుగ్గినేని గోపినాథ్, ప్రకాశం జిల్లా
సబ్సిడీని దూరం చేసే కుట్ర..
ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నంబర్ 169 కాలమ్ నెం:4లో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) గురించి ఉంది. పవర్ ఫ్యాక్టర్ పేరుతో రైతులకు సబ్సిడీని దూరం చేసే కుట్ర చేస్తున్నారు. నిర్దేశించిన పీఎఫ్ రావాలంటే కెపాసిటర్లు పెట్టుకోవాలి. అవి ఏర్పాటు చేసుకోవాలంటే ఎకరాకు రూ.లక్షన్నర ఖర్చు అవుతుంది. ఎకరా లీజు రూ.లక్ష నుంచి లక్షన్నర అవుతుంది. సీడ్ రూ.యాభై వేలు అవుతుంది. రెండు టన్నుల మేత అవసరం. మొత్తానికి ఎకరా సాగుకు రూ.5 లక్షలు అవుతుంది. రైతులపై విపరీతమైన భారం పడుతోంది.
– సీహెచ్ కుమారదత్తాత్రేయ వర్మ, పాలకొల్లు
సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు
డాలర్ విలువ రూ.90 అయినా ఆక్వా రైతుకు రేటు రూ.240 దాటడం లేదు. డాలర్ విలువ రూ.40 ఉన్నప్పుడు వనామీ రేటు రూ.300 పలికేది. కరెంట్ సబ్సిడీ బూచిగా చూపించి ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. సొంత మనుషుల కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. ఫీడ్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతి ఇస్తున్నారు.
– ప్రసాదరాజు, పశ్చిమ గోదావరి జిల్లా
థాయ్‌లాండ్ విధానాలు అనుకూలం
థాయిలాండ్‌లో ఆక్వా సాగు బాగుంది. అక్కడి విధానాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– రాజ్‌కుమార్
ప్రభుత్వం నిద్రపోతోంది..
ఆక్వా కంపెనీలు ముంబై మాఫియాలా నడుస్తున్నాయి. సీజన్ చూసి రేట్లు తగ్గించేస్తున్నారు. ప్రభుత్వం నిద్రపోతోంది. ఆర్నెల్ల క్రితం ముడిసరుకు రేట్లు తగ్గినప్పుడు కిలోకు రూ.4 తగ్గించామని చెబుతున్నారు. కాని దాన్ని డీలర్ కమీషన్ తగ్గించినట్టు చూపించారు. క్రాప్ హాలిడే ఇస్తే మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా తుప్పుపట్టి
పోతుంది.
– పెద్దిరాజు, పశ్చిమ గోదావరి జిల్లా
ఆక్వాకు జగన్ తోడుగా నిలబడాలి
గత ప్రభుత్వంలో రైతులకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీడ్, సీడ్ ఇచ్చేవి అవే కంపెనీలు. ప్రాసెసింగ్ ప్లాంట్లూ వారివే. పంట వేసినప్పుడు మంచి రేటు ఆశ చూపిస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చే సరికి రేట్లు దించేస్తున్నారు. నర్సాపురంలో మీరు ఫిషరీస్ యూనివర్శిటీ మంజూరుచేశారు. ఇప్పుడు పనులు ముందుకు పోవడంలేదు. ఆక్వాకు జగన్ మరింత తోడుగా నిలబడాలి.
– జి.నారాయణమూర్తి, మొగల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా
మిమ్మల్ని ఓడించినందుకు ఇలా..
ఆక్వా రైతులు దీన పరిస్థితుల్లో ఉన్నారు. మిమ్మల్ని ఓడించినందుకు మాకు ఇది శాపంలా తగిలింది. ఆక్వా రైతులకు మీరు అండగా నిలబడ్డారు. బలమైన వ్యవస్థలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారివే ఫీడ్, సీడ్. ఆక్వాపై ఆధారపడ్డ వారి జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి.
– జయకృష్ణంరాజు, ఉండి
ఆక్వా సంక్షోభంతో ఉపాధికి గండి
ఆక్వా సాగు సంక్షోభంలో ఉంటే ఉపాధి తగ్గిపోతుంది. ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గిపోతుంది. కరెంటు సబ్సిడీని పీఎఫ్‌కి లింకు చేయడం అన్యాయం. కరోనా సమయంలో కూడా గత ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది. కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేశారు. ఆ రోజు జగన్ చర్యలు తీసుకోకుంటే ఆక్వా రంగం
కుదేలయ్యేది.
– ధర్మరాజు
జగన్ గళం విప్పితే.. పరిష్కారం
నాణ్యమైన సీడ్ ఇవ్వడం లేదు. జగన్ గళం విప్పితే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మేం ఇక్కడ మీటింగ్‌కు వస్తుంటే అక్కడ వేరే పార్టీ వాళ్లు ఆందోళనకు దిగారు.
– నానిరాజు, అమలాపురం
ఫీడ్ కంపెనీలపై తిరగబడతాం
ఫీడ్ కంపెనీల మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క మాట చెబితే చాలు. మేం ధైర్యంగా పోరాడగలం. ఫీడ్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లన్నీ ఒకే వర్గం వారి చేతుల్లో ఉన్నాయి. దీంతో మాకు చాలా అన్యాయం జరుగుతోంది.
– అండ్రాజు చల్లారావు, ఆప్కాబ్ మాజీ ఛైర్మన్
ఆర్బీకేల ద్వారా పంపిణీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా సర్టిఫికేషన్ చేసేవాళ్లు. ఇవాళ అందుకోసం ఎకరాకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అప్పట్లో భూసార పరీక్షలు జరిగాయి. ఇప్పుడు జరగడం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అప్పుడు ఫీడ్ పంపిణీ జరగేది. ఇప్పుడు జరగడం లేదు. చిన్న, సన్నకారు రైతులు రోజువారీ కూలీలుగా మారిపోతున్నారు.
– నరసింహారావు, ఆక్వా రైతు


