
సాక్షి, తాడేపల్లి: మిగులు జలాలు లేకుండా బనకచర్ల నిర్మాణం సరికాదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఇంద్రావతి నుంచి రావాల్సిన నీళ్లురావడం లేదని.. కేంద్రం మద్దతుతో ఛత్తీస్‌గఢ్ నీటిన ఆపేసిందన్నారు. ప్రాణహిత నుంచి నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారింది. పోలవరం ఎత్తు విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారు. 45.72 నుంచి 41.72 మీటర్లకు కుదించేందుకు ఒప్పుకున్నారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘ఎత్తు తగ్గితే నీటిని కృష్ణాకు తరలించే అవకాశం లేదు. మిగులు జలాలు లేకుండా బనకచర్లకు ఎలా నీళ్లు తరలిస్తారు?. ఎత్తు పెంచేందుకు కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రమే నిర్మించాలి. రూ.15 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి నిర్మించాలి. మిగుల జలాల అంచనా తర్వాతే ముందుకు సాగాలి. నీళ్లే లేనప్పుడు పోలవరం కోసం రూ.80 వేల కోట్లు వృథా. నిజానిజాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు.
