Ys Jagan: కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ.. | Ys Jagan Praja Darbar Pulivendula 2nd Day | Sakshi
Sakshi News home page

Ys Jagan: కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..

Apr 22 2026 9:32 PM | Updated on Apr 22 2026 9:35 PM

Ys Jagan Praja Darbar Pulivendula 2nd Day

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.

ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు.

వైఎస్‌ జగన్‌ ఉదయం ఇప్పట్ల పర్యటన తర్వాత భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.

వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని..  ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు,  యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు.

వైఎస్‌ జగన్‌ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్‌తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కార్యాలయ ప్రాంగణమంతా జగన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్‌ జగన్‌ నినాదాలతో హోరెత్తింది. వైఎస్‌ జగన్‌ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్‌ నినాదాలతో నినదించారు.

Advertisement
 
Advertisement
Advertisement