ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా?: వైఎస్‌ జగన్‌

Jul 13 2025 5:43 AM | Updated on Jul 13 2025 5:49 AM

YS Jagan Mohan Reddy fires on Chandrababu Naidu

ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచి వేస్తారా? 

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు 

సమస్యలు లేవనెత్తే ప్రజలు, విపక్షాన్ని సహించడం లేదు 

తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు 

రాష్ట్రంలో ఏ ఒక్కరినీ ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు 

ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతోంది 

ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం 

గుంటూరు మిర్చి యార్డు, రామగిరి, పొదిలి, సత్తెనపల్లి, బంగారుపాళ్యం పర్యటనలపై ఇష్టారాజ్యంగా కేసులు 

ఆయా ప్రాంతాల్లో ఎంతో మందిని అదుపులోకి తీసుకుని వేధింపులు 

తొలుత ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి ఇంకా ఇతరులు అని కేసులు 

ఆపై టార్గెట్‌ మేరకు పేర్లు చేర్చుకుంటూ పోవడం మామూలైంది 

వాయిస్‌లెస్‌ పీపుల్‌ వాయిస్‌ను నొక్కేస్తున్నారని మండిపాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని.. వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అసలు ప్రజా­స్వామ్యంలో ఉన్నామా.. లేక నియంతృత్వంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్య­మం ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. ‘ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. 

కానీ, దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు­లను చంద్రబాబు సారథ్యంలోని ప్రభు­త్వం నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలో ఉన్నామా? అని సందేహం కలిగే స్థాయికి అది చేరింది. ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. 

ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరినీ కూడా ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు. దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్ధతి ప్రకా­రం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి.. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండకూడదన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు.. పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరుకు ఈ ఘటనలు అద్దం పడుతున్నాయి.  

ఫిబ్రవరి 19, 2025. 
గుంటూరు మిర్చి యార్డు 
‘దారుణంగా ధరలు పతనం కావడంతో మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చి యార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చి యార్డును సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.  

ఏప్రిల్‌ 8, 2025. 
శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి 
టీడీపీ మూకల చేతిలో దారుణ హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపైనా కేసు పెట్టారు.  

జూన్‌ 11, 2025. 
ప్రకాశం జిల్లా పొదిలి 
ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే మూడు కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.

జూన్‌ 18, 2025. 
పల్నాడు జిల్లా సత్తెనపల్లి 
గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. ఐదు కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.   

జూలై 9, 2025. 
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం 
ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని మార్కెట్‌ యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా ఐదు కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశ పెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.  

టార్గెట్‌ పెట్టుకున్న వారందరిపై కేసులు 
ప్రతి కేసుకు సంబంధించి ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్‌ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్బంధం విధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చే­యడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. 

చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరా­డేది కూడా విపక్షమే. అలాంటి మా పార్టీని.. సీఎం చంద్రబాబు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అణిచి వేసే ప్ర­యత్నాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారు. 

లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్‌ పీపుల్‌ వా­యిస్‌ను నొక్కేస్తున్నారు. అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు.. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు.. అన్న విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement