
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం.. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి. తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో కేసులను నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ, తప్పుడు కేసుల్లో బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలన్నారు. న్యాయవాదుల సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు అంటూ హమీ ఇచ్చారు. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్..‘రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం.

బెదిరింపులతో తప్పుడు కేసులు..
ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం.
అట్టడుగు వర్గాలకు తోడుగా నిలిచాం.
జీపీలు, ఏజీపీల్లో అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చాం. న్యాయవాదుల సంక్షేమ నిధికోసం రూ.100 కోట్లు కేటాయించాం. ఇన్సూరెన్స్ కోసం 1/3 వాటాగా మన ప్రభుత్వమే ఇచ్చింది. ఇన్ని రకాలుగా మనం న్యాయవాదులకు మేలు చేశాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మాదిరిగా న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానివి అన్నీ అబద్ధాలు, మోసాలే. అన్ని రంగాల్లో తిరోగమనమే. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. పురోగతి, అభివృద్ధి అన్నవి కనిపించడం లేదు. అవినీతి విచ్చలవిడిగా ఉంది.
పని చేసిన వారికి తప్పకుండా గుర్తింపు..
జగన్ 2.Oలో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్‌గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో, అన్యాయంగా బాధ పెట్టించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి.
లిక్కర్‌లో భారీగా అవినీతి..
లిక్కర్‌లో అవినీతి విపరీతంగా ఉంది. ఎంఆర్‌పీ రేట్లకు మించి అమ్ముతున్నారు. ప్రతీ గ్రామంలోనూ వీధికి ఒక బెల్టుషాపు ఉంది. బెల్టుషాపులకూ వేలం వేస్తున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతున్నారు. అక్కడ కూడా ఎమ్మార్పీ రేట్లు కన్నా అధికంగా అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పేరిట దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక ఎవరికి చేరుతోంది?. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదు. కొంతమంది పోలీసులు దగ్గరుండి పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు.
అమరావతిలో కమీషన్ దందా..
అమరావతిలో అవినీతికి అంతులేకుండా పోతోంది. చదరపు అడుగుకు రూ.4వేలు పెడితే ఫైవ్ స్టార్ సదుపాయాలు వస్తాయి. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10వేలు ఖర్చు చేస్తున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. 10 శాతం ఇచ్చి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మనం రూ. 2.49లకు పీపీఏ చేసుకుంటే, దానిపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు రూ.4.60 పైసలకు పీపీఏ చేసుకుంటున్నారు. అవినీతికి అంతులేకుండా పోయింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్, మైనింగ్, పరిశ్రమలు నడపాలన్నా.. కమీషన్లు ఇవ్వాల్సిందే. పోలీసులు దగ్గరుండి వీటికి సహకరిస్తున్నారు. కళ్ల ముందే కరప్షన్ కనిపిస్తోంది అని ఆరోపించారు.
