పోలీసుల దాష్టీకాన్ని వైఎస్ జగన్‌కు ఆధారాలతో వివరిస్తున్న బాధితులు
‘అప్సడా’కు తెలీకుండా ఆక్వా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని ప్రకటనలు చేస్తారా?
ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది?
ఆ కంపెనీలు మీ సానుభూతిపరులవి కాబట్టే కదా?.. కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీ పడ్డారన్నది నిజం కాదా?
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
ఆక్వా ఫీడ్ ధరలు తాత్కాలికంగా నిలిపేశామంటూ మొసలికన్నీరు కార్చడం కాదు.. వాటిని తక్షణమే ఉపసంహరించాలి
లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించిన జగన్
సాక్షి, అమరావతి/పొన్నూరు: రైతులపై దాడి చేసి, తిరిగి వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతల అరాచకాలపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర లేక పంట నిల్వ చేసుకున్న రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గపు చర్య అని, పైగా బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో రైతులకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, బాధిత రైతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ సీఎం వైఎస్ జగన్‌ని గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి రైతులు కలిశారు. పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరాచకాలు, దాడులను, వారు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న కేసులను వివరించారు. అంతేకాకుండా మొక్కజొన్నకు ధర లేకపోవడంతో రైతులుగా తాము పంట నిల్వ చేసుకున్న గోడౌన్‌పై టీడీపీ గూండాలు దాడి చేయడం, రాడ్లతో గోడౌన్ తాళాలు పగలగొట్టి అరాచకానికి పాల్పడటం, అడ్డుకున్న తమపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్‌కు రైతులు వివరించారు.
పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రోద్బలంతో 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గూండాలు మామిళ్లపల్లిలో చేసిన విధ్వంసం ఫొటోలు, వీడియోలు వైఎస్ జగన్‌కు గోడౌన్ యజమాని సోదా సముద్రయ్య, పొన్నూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ, ఇతర రైతులు చూపించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని, లీగల్ సెల్ న్యాయ సహాయం అందిస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.


