చెలరేగిన బ్లేడ్‌ బ్యాచ్‌.. నడిరోడ్డుపై యువకుడి హత్య

Young Man killed by Blade batch in Dhavaleswaram - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(ధవళేశ్వరం): ప్రశాంతంగా ఉన్న ధవళేశ్వరం గ్రామంలో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బ్లేడ్‌బ్యాచ్‌ దుండగులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుడి దాడిలో ధవళేశ్వరం కంచర్లలైన్‌ ప్రాంతానికి చెందిన యువకుడు అండిబోయిన రాజేష్‌ (23) మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

కత్తితో దాడి 
తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్న అండిబోయిన రాజేష్‌ తండ్రి గతంలో మృతి చెందారు. తల్లి, రాజేష్‌ కలిసి జీవనం సాగిస్తున్నారు. అతడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కంచర్లలైన్‌ సెంటర్‌లో రాజేష్‌ ఉన్నాడు. ఆ సమయంలో బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సభ్యులు బైక్‌పై అక్కడకు వచ్చారు. రాజేష్‌ను వెయ్యి రూపాయలు అడిగారని స్థానికులు చెబుతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాజేష్‌ను ఇందిరా కాలనీకి చెందిన బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుడు (మైనర్‌) కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.

అనంతరం ముగ్గురు దుండగులూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌ను స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన బాలుడిపై ధవళేశ్వరంలో ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజేష్‌ హత్యతో అతడి తల్లి రోడ్డున పడింది. 

చదవండి: (రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్‌’ డయాగ్నస్టిక్‌  సెంటర్‌ నిర్వాకం)

స్థానికుల ఆగ్రహం 
బ్లేడ్‌బ్యాచ్‌ దాడిలో రాజేష్‌ మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై మంటలు వెలిగించి, బైఠాయించారు. రాజేష్‌ను హత్య చేసిన బ్లేడ్‌బ్యాచ్‌ యువకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో గ్రామంలో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రధాన రహదారి మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిచారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. 

బ్లేడ్‌బ్యాచ్‌ పని పట్టాలి 
ధవళేశ్వరంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కంచర్లలైన్‌ ప్రాంత వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం దాడికి ఒడిగట్టిన బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యులు తరచుగా కంచర్లలైన్‌ ప్రాంత వాసులపై దాడులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంతో వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బ్లేడ్‌బ్యాచ్‌ పని పట్టే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని నియమించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top