breaking news
rajesh dies
-
చెలరేగిన బ్లేడ్ బ్యాచ్.. నడిరోడ్డుపై యువకుడి హత్య
సాక్షి, తూర్పుగోదావరి(ధవళేశ్వరం): ప్రశాంతంగా ఉన్న ధవళేశ్వరం గ్రామంలో బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. బ్లేడ్‌బ్యాచ్ దుండగులు నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడి దాడిలో ధవళేశ్వరం కంచర్లలైన్ ప్రాంతానికి చెందిన యువకుడు అండిబోయిన రాజేష్ (23) మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ దారుణంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కత్తితో దాడి తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్న అండిబోయిన రాజేష్ తండ్రి గతంలో మృతి చెందారు. తల్లి, రాజేష్ కలిసి జీవనం సాగిస్తున్నారు. అతడికి వచ్చే నెలలో వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం కంచర్లలైన్ సెంటర్లో రాజేష్ ఉన్నాడు. ఆ సమయంలో బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సభ్యులు బైక్‌పై అక్కడకు వచ్చారు. రాజేష్‌ను వెయ్యి రూపాయలు అడిగారని స్థానికులు చెబుతున్నారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో రాజేష్‌ను ఇందిరా కాలనీకి చెందిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యుడు (మైనర్) కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు దుండగులూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న రాజేష్‌ను స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన బాలుడిపై ధవళేశ్వరంలో ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజేష్ హత్యతో అతడి తల్లి రోడ్డున పడింది. చదవండి: (రాసింది ఒకటి.. చేసింది మరొకటి.. ‘స్టార్’ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాకం) స్థానికుల ఆగ్రహం బ్లేడ్‌బ్యాచ్ దాడిలో రాజేష్ మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ధవళేశ్వరం ప్రధాన రహదారిపై మంటలు వెలిగించి, బైఠాయించారు. రాజేష్‌ను హత్య చేసిన బ్లేడ్‌బ్యాచ్ యువకుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామంలో రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రధాన రహదారి మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లిచారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టాలి ధవళేశ్వరంలో రోజురోజుకూ పేట్రేగిపోతున్న బ్లేడ్‌బ్యాచ్ సభ్యులపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కంచర్లలైన్ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం దాడికి ఒడిగట్టిన బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు తరచుగా కంచర్లలైన్ ప్రాంత వాసులపై దాడులకు పాల్పడుతున్నారని, అయినప్పటికీ పోలీసులు తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంతో వారి ఆగడాలు మరింత పెరిగిపోతున్నాయని ఆరోపించారు. బ్లేడ్‌బ్యాచ్ పని పట్టే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కాపాలకెళ్లి.. కానరాని లోకాలకు
శెట్టూరు (కళ్యాణదుర్గం) : అడవి పందుల నుంచి రాత్రిపూట పంటను కాపాడటానికి కాపలాగా వెళ్లిన ఇద్దరు యువకులు పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు...శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన రామలింగ, మల్లక్కల కుమారుడు రాజేష్ (17) ఇంటర్మీడియట్ పాసయ్యాడు. డిగ్రీలో చేరాల్సి ఉంది. వేరుశనగ పంటను అడవిపందులు ధ్వంసం చేయకుండా కాపలా కాసేందుకు తన బంధువు రాజుతో కలిసి కలిసి గురువారం రాత్రి తోటకు వెళ్లారు. బాగా పొద్దుపోయిన తర్వాత అక్కడే ఉన్న గుడిసెలో నిద్రకు ఉపక్రమించారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రాజేష్ కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లారు. రాజేష్ శరీరంపై పాము కాట్లను గుర్తించి కుటుంబ సభ్యులు హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడి వైద్యులు సూచన మేరకు అటు నుంచి అనంతపురం తరలిస్తుండగా రాజేష్ మార్గం మధ్యలో మృతి చెందాడు. అంతలోనే ఇంటి వద్ద ఉన్న రాజుకు సైతం పాము కాటు వేసినట్లు తెలుసుకుని ఉదయాన్నే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. మంచి చదువులు చదవి మాకు పెద్ద దిక్కుగా ఉంటావనుకుంటిమే.. పాము కాటు రూపంలో ఒక్కగానొక్క కుమారుడిని ఇలా తీసుకెళితివా..దేవుడా ఎంత పనిచేశావయ్యా’ అంటూ రాజేష్ తల్లి మల్లక్క, చెల్లెలు సుకన్య రోదించడం అందరినీ కలచివేసింది.