ప్రాజెక్టుల పురోగతిపై నిజాలకు నీళ్లు

Yellow Media Fake Articles On Irrigation Projects Works In AP - Sakshi

‘నత్తనడక’ అంటూ చెత్తరాతలు

ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందుకు సీఎం ప్రణాళిక

వెలిగొండ తవ్వకం నాడు రోజుకో అడుగు.. నేడు 7 మీటర్లు 

కరోనా, వరదలతో ఆటంకం కలిగినా షెడ్యూలు ప్రకారం ముందుకు 

ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందుకు ముఖ్యమంత్రి ప్రణాళిక 

ఈ సీజన్లో ఆరు ప్రాజెక్టులు ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం  

వాస్తవానికి విరుద్ధంగా పనులు నత్తనడకన సాగుతున్నట్లు ‘ఈనాడు’ వక్రభాష్యం

టీడీపీ సర్కార్‌ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని దుస్థితి

నాటి వైఫల్యాలు పట్టించుకోని ‘ఈనాడు’  

ఎల్లోవైరస్‌ కమ్మేసిన కళ్లకు ఇంతకన్నా ఏం కనిపిస్తుంది? ఎందుకంటే వీళ్లకు చంద్రబాబైతే ఓకే!. చంద్రబాబు మాత్రమే ఓకే!!. ఆయన నిద్రపోతున్నా రామోజీ కళ్లకు రన్నింగ్‌ చేస్తున్నట్లే కనిపిస్తాడు. అదంతే!!. టీడీపీ సర్కారు హయాంలో వెలిగొండ ప్రాజెక్టు సొరంగాన్ని సగటున రోజుకు ఒకే ఒక్క అడుగు తవ్వారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక సొరంగం పనులను చూస్తే సగటున రోజుకు 7 మీటర్లు తవ్వుతున్నారు. కానీ ‘ఈనాడు’ కళ్లకు ఏనాడూ ఇది కనిపించదు. అధికారంలో ఉన్నది బాబు కాదు కనుక ఇప్పుడు పనులు అత్యంత నెమ్మదిగా సాగుతున్నాయని రాసేస్తారు. ఇక సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని 2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. చంద్రబాబు హయాంలో పనులు కదిలితే ఒట్టు. అదనపు బిల్లుల రూపంలో కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించేసి మరో 20 కోట్లు బాకీ పెట్టారు తప్ప పనులైతే కదల్లేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో పనులు ఊపందుకుని 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతావి వేగంగా పూర్తిచేసి త్వరలో బ్యారేజీని ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు కూడా. ఇవేవీ రామోజీ కళ్లకు కనిపించవు. నీళ్లొదిలేశారు కనక నిజాలతో వీళ్లకు పనిలేకపోవచ్చు. కానీ నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ సవివర కథనం...  

2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో కేవలం 600 మీటర్ల పనులు మాత్రమే చేశారు. అంటే రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే పనులు జరిగాయి. 2019 నవంబర్‌ నుంచి 2020 అక్టోబర్‌ 30 వరకు 2,512 మీటర్ల పనులు చేశారు. అంటే.. రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు. మార్చి నుంచి జూలై వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింది. జూన్‌ నుంచి ఇప్పటి వరకు భారీ వర్షాలు కురిశాయి. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున ఏడు మీటర్ల చొప్పున సొరంగం తవ్వారు.

సాక్షి, అమరావతి: కడలిలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి.. బంజరు భూములకు మళ్లించి.. కరువన్నదే ఎరుగని నేలగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి రచించిన ప్రణాళికను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడం ద్వారా వాటి ఫలాలను రైతులకు అందించడానికి చర్యలు చేపట్టారు. ఈ సీజన్‌లో గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు సొరంగం–2, వెలిగొండ తొలి దశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2, వంశధార–నాగావళి అనుసంధానం పనులను పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రచించారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా మార్చి 23 నుంచి లాక్‌ డౌన్‌ విధించడంతో కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. జూన్‌ నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం వల్ల వరదలు వస్తున్నాయి. అయినప్పటికీ షెడ్యూలు ప్రకారమే పనులు సాగుతుండటం గమనార్హం. 

ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయకుండానే రూ.68,293.94 కోట్ల వ్యయం 
► 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్‌ సాగునీటి ప్రాజెక్టులు, నీరు–చెట్టు పథకాల కింద రూ.68,293.94 కోట్లు ఖర్చు చేసింది. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయింది. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లందించలేకపోయింది. 
► జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63(పరిమాణాల ఆధారంగా బిల్లుల చెల్లింపు)లను అడ్డం పెట్టుకుని కాంట్రాక్టర్లకు అదనపు నిధులను దోచిపెట్టారు. తద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున కమీషన్లు దండుకున్నారు.
► మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి.. వాటిని తన ఖాతాలో వేసుకునే దుస్సాహసానికి టీడీపీ సర్కార్‌ పాల్పడింది. అప్పట్లో సింహభాగం పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తి చేయడంలోనూ టీడీపీ సర్కార్‌ విఫలమైంది. కానీ ఈ వైఫల్యాలు అప్పట్లో ‘ఈనాడు’కు కన్పించకపోవడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే.

17 నెలల్లో రూ.8,090.4 కోట్లు వ్యయం 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రాధాన్యత ప్రాజెక్టులకు రూ.8,090.4 కోట్లు ఖర్చు చేసింది. మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ప్రాజెక్టులను వరుసగా మూడేళ్లలో పూర్తి చేయడం ద్వారా బంజరు భూములను సస్యశ్యామలం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.

పోలవరం పనులు చకచకా 
ఐదు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా 2005లో అప్పటి సీఎం వైఎస్సార్‌ అడుగులు ముందుకు వేశారు. కుడి, ఎడమ కాలువ పనులు సింహభాగం పూర్తి చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, తామే పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే కమీషన్ల కోసం చంద్రబాబు ఈ ప్రాజెక్టును నిరీ్వర్యం చేశారు. నిర్మాణ బాధ్యతను తీసుకుని.. జలాశయం పనుల్లో స్పిల్‌ వే పూర్తి చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేసి గ్రామాలను గోదావరి వరద ముంపునకు గురిచేశారు.    వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేసి రూ.838 కోట్లు ఆదా చేసింది. 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా సీఎం జగన్‌ కార్యాచరణ రూపొందించి,  పనులను పరుగెత్తిస్తున్నారు. వరద ఉధృతిలోనూ 24 గంటలూ స్పిల్‌ వే పనులు జరుగుతున్నాయి. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు, వాటి మధ్య ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ పనులు, కాలువలను జలాశయానికి అనుసంధానించే కనెక్టివిటీ పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు.   

వంశధార–నాగావళి అనుసంధానం 
► శ్రీకాకుళం జిల్లాలో నారాయణపురం వద్ద నాగావళి నదిపై 1959లో ఆనకట్ట నిర్మించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కుడి కాలువ కింద 18,362, ఎడమ కాలువ కింద 18,691 ఎకరాల ఆయకట్టు ఉంది. వంశధారలో జూన్‌ నుంచే వరద ప్రారంభమైతే.. నాగావళి నదిలో వరద ఆలస్యంగా ప్రారంభమవుతుంది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్‌లో నీళ్లందించలేని పరిస్థితి.
► వంశధార రెండో దశలో హిరమండలం రిజర్వాయర్‌ నుంచి 33.583 కి.మీ పొడవున తవ్వే హైలెవల్‌ కెనాల్‌ ద్వారా రోజుకు 600 క్యూసెక్కుల వంశధార జలాలను తరలించి.. నారాయణపురం ఆనకట్ట జలవిస్తరణ ప్రాంతం వద్ద నాగావళిలోకి తరలించడం ద్వారా నారాయణపురం ఆనకట్ట ఆయకట్టులో ఖరీఫ్‌ పంటలకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించనున్నారు. నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాలను స్థిరీకరించనున్నారు. హైలెవల్‌ కెనాల్‌ తవ్వకం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్‌లోగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

అవుకు సొరంగం 
► గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను గండికోట జలాశయానికి తరలించాలి. కాలువలో అవుకు జలాశయానికి ముందు పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 5.75 కి.మీల పొడవున రెండు సొరంగాలు(టన్నెల్స్‌) తవ్వాలి. కుడి సొరంగంలో ఫాల్ట్‌ జోన్‌ (మట్టి పొరలు) అడ్డు రావడంతో ప్రత్యామ్నాయంగా రెండు మళ్లింపు సొరంగాలు తవ్వి పది వేల క్యూసెక్కులను మాత్రమే తరలించేలా పనులు చేపట్టారు.
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కుడి సొరంగంలో 165 మీటర్ల మేర ఏర్పడిన ఫాల్ట్‌ జోన్‌ను, ఎడమ సొరంగాన్ని పూర్తి చేసి.. 20 వేల క్యూసెక్కులు తరలించేలా పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.
► 22 మీటర్ల పని పూర్తయ్యింది. ఆ తర్వాత వర్షాలతో మట్టి పెళ్లలు ఊడిపడటంతో పనులకు సాంకేతిక సమస్య ఏర్పడింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కెమికల్‌ గ్రౌటింగ్‌ ద్వారా పైకప్పును స్థిరీకరించి.. పైపులను అమర్చి లైనింగ్‌ చేసే పనులు చేపట్టారు. నిపుణులైన కార్మికులను రప్పించి.. 143 మీటర్ల మేర గ్రౌటింగ్‌ పనులను వేగవంతం చేశారు. 

వెలిగొండ 
► శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద జలాల్లో 43.50 టీఎంసీలను తరలించి.. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాళెం, దర్శి, కొండెపి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో 3.36 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 84 వేల ఎకరాలు, వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 27,200 ఎకరాలు వెరసి 4,47,200 ఎకరాలకు నీళ్లందించడం.. 15.25 లక్షల మంది దాహార్తి తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టును 2004లో అప్పటి సీఎం వైఎస్సార్‌ చేపట్టారు. 
► ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయాన్ని అనుసంధానం చేసేలా 18.820 కి.మీల పొడవున ఒకటి.. 18.838 కి.మీల పొడవున మరో సొరంగం తవ్వాలి. వైఎస్సార్‌ హయాంలో మొదటి సొరంగంలో 15.2 కి.మీ మేర పనులు, రెండో సొరంగంలో 10.75 కి.మీ పనులు పూర్తయ్యాయి.
► టీడీపీ సర్కార్‌ హయాంలో మొదటి టన్నెల్‌లో 600 మీటర్లు.. రెండో సొరంగంలో 416 మీటర్ల మేర మాత్రమే పనులు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మొదటి టన్నెల్‌లో 2,512 మీటర్ల పనులు పూర్తి చేశారు. మిగిలిన 265 మీటర్ల పనులను పూర్తి చేసి, డిసెంబర్‌లో ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో టన్నెల్‌ను జూన్‌కు పూర్తి చేయనున్నారు. 

వంశధార ఫేజ్‌–2, స్టేజ్‌–2
► శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార ప్రాజెక్టు రెండో దశకు మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో శ్రీకారం చుట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధారపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా ఫలాలను అందించాలని ప్రాజెక్టు డిజైన్‌ల్లో మార్పులు చేశారు.
► భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్‌ వియర్‌ (మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులను వరద కాలువ ద్వారా తరలించి 0.0686 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలతో పారాపురం వద్ద మరొకటి.. హిరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో ఇంకో రిజర్వాయర్‌ను నిర్మించే పనులు చేపట్టారు. వైఎస్సార్‌ హయాంలోనే 75 శాతం పనులు పూర్తయ్యాయి. 
► గత టీడీపీ ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయడంలో విఫలమైంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వరద కాలువలో మిగిలిన పనులు పూర్తి చేసింది. హిరమండలం రిజర్వాయర్‌లో మిగిలిన పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఆయకట్టుకు నీళ్లందించే పిల్ల కాలువల పనులు జరుగుతున్నాయి. 2021 జూలైలో ప్రాజెక్టును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

సంగం బ్యారేజీ
► పెన్నా నదిపై బ్రిటీష్‌ సర్కార్‌ హయాంలో 1882–86లో నిర్మించిన సంగం బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కాన్పూర్‌ కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కష్టంగా మారింది. 
► ఈ నేపథ్యంలో పాత బ్యారేజీకి దిగువన 0.45 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా సంగం బ్యారేజీ కమ్‌ వంతెన నిర్మాణ పనులను 2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించి పెన్నా డెల్టాకు జీవం పోసేందుకు శ్రీకారం చుట్టారు. బ్యారేజీ పనులకు రూ.32 కోట్లు ఖర్చు చేశారు. సాంకేతిక సమస్యల వల్ల 2013 ఆగస్టు నుంచి పనులు ఆగిపోయాయి.
► బ్యారేజీని పరిశీలించిన నిపుణుల కమిటీ బ్యారేజీ పొడవును 846 నుంచి 1,195 మీటర్లకు పెంచాలని సూచించింది. ఆ మేరకు 2016 ఫిబ్రవరిలో పనులు చేపట్టారు. 2016 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు చేసిన పనులకు బిల్లులు, ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లుల రూపంలో టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు రూ.70 కోట్లు చెల్లించింది. మరో రూ.20 కోట్లు బకాయి పెట్టింది.

ఊపందుకున్న పనులు 
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీ పనులు ఊపందుకున్నాయి. పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 
► బ్యారేజీకి కుడి వైపు అప్రోచ్‌ బండ్స్, దిగువన గైడ్‌ బండ్స్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. బ్యారేజీకి 85 సర్వీసు గేట్లకు గాను 70 గేట్లు పూర్తయ్యాయి. 9 స్టాప్‌ లాగ్‌ గేట్లకు గాను ఒక గేటు పూర్తయ్యింది. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. గేట్లను ఎత్తడానికి, దించడానికి వాడే హాయిస్ట్‌ మెకానిజం పనులకు సంబంధించి 85 గేట్లకుగాను 37 గేట్లకు బిగించే పనులు పూర్తయ్యాయి. 200 మంది కార్మికులు పగలు, రాత్రి షిఫ్టుల ప్రకారం పని చేస్తున్నారు.
► పెన్నా నదిలో వరద ఉధృతి తగ్గగానే మిగిలిన కాంక్రీట్‌ పనులు పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. 2019 మే నుంచి ఇప్పటి వరకు బ్యారేజీ పనులకు రూ.41 కోట్లు ఖర్చు చేశారు. బ్యారేజీ పనుల్లో 82.26 శాతం పూర్తయ్యాయి. మిగతా 17.74 శాతం పనులను త్వరితగతిన పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద బ్యారేజీ పనులకు ఇప్పటిదాకా రూ.163.00 కోట్లు ఖర్చు చేశారు.

నెల్లూరు బ్యారేజీ 
► సంగం బ్యారేజీ దిగువన పెన్నాపై 1855లో బ్రిటీష్‌ సర్కార్‌ నిర్మించిన నెల్లూరు బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో 99,925 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ ఆయకట్టుకు జీవం పోయడానికి పాత బ్యారేజీకి 50 మీటర్ల దిగువన కొత్తగా బ్యారేజీ నిర్మాణ పనులను అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో చేపట్టారు. సింహభాగం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి.
► 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు బ్యారేజీ పనులకు గ్రహణం పట్టుకుంది. కాంట్రాక్టర్‌ చేసిన పనులకు రూ.1.54 కోట్లను కూడా టీడీపీ సర్కార్‌ చెల్లించలేదు.
► వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు గాడిలో పడ్డాయి. లాక్‌డౌన్‌ సమయంలో మినహా మిగిలిన రోజుల్లో నిర్విరామంగా పనులు జరుగుతున్నాయి. 
► ఇప్పటి వరకు 86.35 శాతం పనులు పూర్తయ్యాయి. వాటికి రూ.127.64 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 13.65 శాతం పనులను శరవేగంగా పూర్తి చేసి, బ్యారేజీని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఆయకట్టుకు సాగు నీరుతోపాటు నెల్లూరు నగర దాహార్తి తీరుతుంది. కోవూరుకు రవాణా ఇబ్బందులు తీరతాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top