రమేష్‌ ఆస్పత్రి నిర్వాకం.. డబ్బులు చెల్లించాకే

Woman Deceased While Receiving Treatment At Ramesh Hospital Guntur - Sakshi

మృతదేహం అప్పగించని ఆస్పత్రి యాజమాన్యం 

ప్రజాసంఘాల ఆందోళనతో దిగొచ్చిన వైనం

సాక్షి, గుంటూరు మెడికల్‌: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందగా, డబ్బులు చెల్లించాకే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పిన ఘటన గుంటూరులోని రమేష్‌ హాస్పిటల్‌లో సోమవారం జరిగింది. ప్రజాసంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నా చేయటంతో చివరకు మృతదేహాన్ని అప్పగించారు. గుంటూరు మార్కెట్‌ సెంటర్‌లోని రమేష్‌ హాస్పిటల్‌ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామానికి చెందిన చింతగుంట్ల విజయలక్ష్మి (40)కి గత నెల 26న బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశారు. మెరుగైన చికిత్స గుంటూరు రమేష్‌ హాస్పిటల్‌లో ఉందంటూ ఆస్పత్రి యాజమాన్యం అదే నెల 29న గుంటూరుకు ఆమెను రిఫర్‌ చేసింది.

గుంటూరులో రూ.3 లక్షలు ఖర్చుపెట్టుకుంటే విజయలక్ష్మి కోలుకుంటుందని చెప్పటంతో కుటుంబసభ్యులు ఆ మేరకు సొమ్ము చెల్లించారు. సెపె్టంబర్‌ ఒకటిన ఆపరేషన్‌ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. నాలుగు రోజుల్లో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పినా మెరుగుపడకపోవటంతో కుటుంబ సభ్యులు ఈ విషయంపై వైద్యులను ప్రశ్నించారు. ప్రతిరోజూ రూ.50 వేలు కడితేనే ఆస్పత్రిలో వైద్యం అందిస్తామని, లేకపోతే వెళ్లిపోవాలని చెప్పటంతో ఇప్పటివరకు రూ.11 లక్షలు ఖర్చు చేసినట్టు విజయలక్ష్మి భర్త రాజు తెలిపారు. అప్పు చేసి ఆస్పత్రికి రూ.11 లక్షలు కట్టినా తన భార్య సోమవారం చనిపోయిందని రాజు వాపోయాడు.

ఆమె భౌతికకాయాన్ని అప్పగించేందుకు రూ.1.30 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యజమాన్యం డిమాండ్‌ చేయటంతో బాధితుడు ప్రజా సంఘాల వారిని సంప్రదించాడు. ఆంధ్ర బహుజన సమితి నాయకుడు పంతగాని రమేష్‌, అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకుడు బత్తుల వీరాస్వామి, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు విజయభాస్కర్, వినయ్‌కిషోర్, ఇతర సంఘాల నేతలు ఆస్పత్రి యాజమాన్యం తీరును నిరసిస్తూ రమేష్‌ హాస్పిటల్‌ ఎదుట ధర్నా చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం దిగివచ్చి విజయలక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది.    (పది మంది చనిపోతే దర్యాప్తు చేయొద్దా?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top