నమూనాలు సేకరించి ల్యాబ్‌లకు పంపిన అధికారులు
సాక్షి, అమరావతి: ఆక్వా చెరువుల్లో ‘వైట్ గట్’ బ్యాక్టీరియా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో రైతు పి.మనోజ్‌వర్మ చెరువును మత్స్యశాఖ అధికారులు శనివారం పరిశీలించారు. నీరు, రొయ్యలు, ఫీడ్, మల నమూనాలను సేకరించి పరీక్షల కోసం కైకలూరు, భీమవరం ల్యాబ్‌లకు పంపారు.
వైట్ గట్ బ్యాక్టీరియా 2013లో దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న తల్లి రొయ్యల ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఈ బ్యాక్టీరియా వల్ల రొయ్యల అన్నవాహిక ఇన్‌ఫెక్షన్ సోకి వాచిపోతుంది. దీంతో ఫీడ్ తినే పరిస్థితి లేక రొయ్య బరువు తగ్గిపోయి క్రమంగా చనిపోతుంది. బ్యాక్టీరియా సోకిన రొయ్య మలాన్ని మరొక రొయ్య తింటే అది కూడా చనిపోతుందని అధికారులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రొయ్యల మలం పూర్తిగా చెరువు పైకి తేలియాడుతుంటే.. ‘వైట్ గట్’ ఉన్నట్లు గుర్తిస్తారు. చెరువులోని నీటిని బయటకు తీసేసి మళ్లీ నింపుకోవాలని.. ఫీడ్ నియంత్రిస్తూ బ్యాక్టీరియా నిర్మూలన ద్రావణాలు పిచికారీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ‘రొయ్యల పట్టుబడి పూర్తి కాగానే చెరువును పూర్తిగా ఎండబెట్టి ఫీడ్ వ్యర్థాలను ట్రాక్టర్ బ్లేడ్ సాయంతో పూర్తిగా చెరువు నుంచి బయటకు తీసేయాలి.
నేలకు, నీళ్లకు సంబంధించిన ప్రొబయోటిక్స్ వాడుకుంటే సరిపోతుంది’ అని తెలిపారు. కాగా, మత్స్య శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ‘వైట్ గట్’ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించాలని ఆదేశించారు. ఏడు రోజుల్లో తనిఖీలు, నమూనాల సేకరణ, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు.


