breaking news
white gut virus
-
ఆక్వా చెరువుల్లో ‘వైట్ గట్’ లక్షణాలు
సాక్షి, అమరావతి: ఆక్వా చెరువుల్లో ‘వైట్ గట్’ బ్యాక్టీరియా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో రైతు పి.మనోజ్‌వర్మ చెరువును మత్స్యశాఖ అధికారులు శనివారం పరిశీలించారు. నీరు, రొయ్యలు, ఫీడ్, మల నమూనాలను సేకరించి పరీక్షల కోసం కైకలూరు, భీమవరం ల్యాబ్‌లకు పంపారు.వైట్ గట్ బ్యాక్టీరియా 2013లో దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న తల్లి రొయ్యల ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఈ బ్యాక్టీరియా వల్ల రొయ్యల అన్నవాహిక ఇన్ఫెక్షన్ సోకి వాచిపోతుంది. దీంతో ఫీడ్ తినే పరిస్థితి లేక రొయ్య బరువు తగ్గిపోయి క్రమంగా చనిపోతుంది. బ్యాక్టీరియా సోకిన రొయ్య మలాన్ని మరొక రొయ్య తింటే అది కూడా చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రొయ్యల మలం పూర్తిగా చెరువు పైకి తేలియాడుతుంటే.. ‘వైట్ గట్’ ఉన్నట్లు గుర్తిస్తారు. చెరువులోని నీటిని బయటకు తీసేసి మళ్లీ నింపుకోవాలని.. ఫీడ్ నియంత్రిస్తూ బ్యాక్టీరియా నిర్మూలన ద్రావణాలు పిచికారీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ‘రొయ్యల పట్టుబడి పూర్తి కాగానే చెరువును పూర్తిగా ఎండబెట్టి ఫీడ్ వ్యర్థాలను ట్రాక్టర్ బ్లేడ్ సాయంతో పూర్తిగా చెరువు నుంచి బయటకు తీసేయాలి.నేలకు, నీళ్లకు సంబంధించిన ప్రొబయోటిక్స్ వాడుకుంటే సరిపోతుంది’ అని తెలిపారు. కాగా, మత్స్య శాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ‘వైట్ గట్’ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించాలని ఆదేశించారు. ఏడు రోజుల్లో తనిఖీలు, నమూనాల సేకరణ, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు. -
వైట్‌గట్‌పై అప్రమత్తంగా ఉండాలి
కేవీకే ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య నెల్లూరు రూరల్ : రొయ్యలకు సోకే వైట్‌గట్ వైరస్‌పై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎంసీ ఓబయ్య సూచించారు. ముత్తుకూరు మండలం పొట్టెంపాడు లో ఎన్ఎఫ్డీబీ సహకారంతో కేవీకే ఆధ్వర్యంలో రొయ్యల సాగు, సాంకేతిక ప్రక్రియలపై ఆక్వా రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కల్చర్ మొదలు పెట్టిన 20–30 రోజులకు వైట్‌గట్ లక్షణాలు కనబడతాయన్నారు. ఈ వైరస్ సోకిన ఐదు రోజులకే రొయ్య చనిపోతుందన్నారు. కల్చర్ ప్రారంభానికి ముందుగా చెరువులను ఎండబెట్టాలని, అలా చేయకపోవడంతో బాక్టీరియా లేదా ఫంగస్, నీటి టర్బిడిటి ఎక్కువగా ఉండటం ముఖ్య కారణాలన్నారు. రైతులు చెరువుల తయారీ పద్ధతుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి టర్బిడిటిని రోజుకు 20 శాతం నీటితో మార్పిడి ద్వారా వాంఛనీయ స్థాయిలో నిర్వహించుకోవాలన్నారు. వాటితో పాటు వైట్గట్కు ప్రోబయోటిక్స్ వాడుతూ ఉంటే కొంత వరకు నియంత్రించవచ్చన్నారు. కేవీకే మత్స్యవిభాగ శాస్త్రవేత్త ఝాన్సీలక్ష్మీబాయి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జేఆర్ఎఫ్ వెంకటేశ్వర్లు, ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.


