Aadhaar Card: పోయినా... పొందవచ్చు

We can get back Aadhaar, PAN, Driving license cards if lost - Sakshi

ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్‌ కార్డు, ఆధార్, రేషన్‌ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు పోయినప్పుడు ఆందోళనకు గురవుతుంటాం. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. 
  – కడప కార్పొరేషన్‌

డ్రైవింగ్‌ లైసెన్స్‌
డ్రైవింగ్‌ లైసెన్స్‌ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్‌ ట్రేస్డ్‌ సర్టిఫికెట్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ జిరాక్స్‌ను లాస్‌ ఆర్‌ డిస్ట్రడన్‌ ఆఫ్‌ లైసెన్స్‌ అండ్‌ అప్లికేషన్‌ ఫర్‌ డూప్లికేట్‌ ఫారం(ఎల్‌ఎల్‌డీ)తో రోడ్డు రవాణా కార్యాలయంలో అందించాలి. రూ.20 బాండ్‌ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్‌ఎల్‌డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

రేషన్‌ కార్డు
ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు రకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్‌ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్‌ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. ఆదాయ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్డు పోయినప్పుడు  రేషన్‌ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్‌లో నామమాత్రపు రుసుంతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్‌సైట్‌ ద్వారా జిరాక్స్‌ కాపీ పొందవచ్చు. 

పాన్‌ కార్డు 
పాన్‌కార్డు(పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) పోతే సంబంధిత ఏజెన్సీలో పాత  పాన్‌కార్డ్‌ జిరాక్స్, రెండు కలర్‌ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు.

ఏటీఎం కార్డు
బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించాలంటే  ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా , ఎవరైనా దొంగిలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. సంబంధిత బ్యాంకు టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్‌ చేయించవచ్చు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. 

ఓటరు కార్డు 
కేవలం ఓటు వేయడానికి కాకుండా కొన్ని సార్లు నివాసం, పుట్టిన తేది ధ్రువీకరణ కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్‌ బూత్‌ నంబర్, కార్డ్‌ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ సేవా కేంద్రంలో గానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ మళ్లీ కార్డు పొందవచ్చు. నంబర్‌ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. 

ఆధార్‌ కార్డు 
ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్‌ 18001801947కు కాల్‌ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. కొత్త కార్డు మళ్లీ పోస్టు ద్వారా పంపిస్తారు. వెబ్‌సైట్‌లోగానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ పూర్తి సమాచారం పొందవచ్చు. 

పాస్‌పోర్ట్‌
పాస్‌పోర్ట్‌ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి ఆచూకీ లభించకపోతే.. నాన్‌ ట్రేస్డ్‌ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్‌ అధికారి పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్‌ పాస్‌పోర్ట్‌ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలం పడుతుంది. తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top