‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం’

'We Are Against The Privatization Of Visakha Steel Plant Gudivada Amarnath - Sakshi

శ్రీకాకుళం: విశాఖ స్టీల్‌ప్టాంట్‌ ప్రైవేటికరణకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్టాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి అనేకసార్లు తెలిపిన విషయాన్ని అమర్నాథ్‌ మరోసారి ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్నాథ్‌.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిపి తమ ఉద్దేశాన్ని తెలుపుతూ కేంద్రానికి, ప్రధానికి మూడుసార్లు సీఎం జగన్‌ లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

‘విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మరాదన్నదే మా స్టాండ్. అటువంటప్పుడు ప్రైవేటీకరణ.. ఎవరు కొంటారు.. అన్న ప్రశ్నలే ఉత్పన్నం కావు. కేంద్రప్రభుత్వమే ప్లాంట్‌ను నడపాలన్నది మా ప్రభుత్వ డిమాండ్‌. ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ అనే సెంటిమెంట్‌ను కాపాడతాం. దానికోసం ఇప్పటికే ప్రధానికి మూడుసార్లు లేఖలు రాశాం. అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఉద్యమానికి మద్ధతు ఇస్తున్నాం.’ అని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్‌ స్టాండ్‌పై క్లారిటీలేదు
‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ .. మళ్లీ అదే ప్లాంట్‌ను కొంటారని ఎలా అనుకుంటారు..? ఒకవేళ అదే నిజమైతే, ప్లాంట్‌ను అమ్మేయాలన్నది వారి ఉద్దేశమా..?.  అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.  దీనిపై కేసీఆర్‌ గానీ.. బీఆర్‌ఎస్‌ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్‌ను మేం వినలేదు.  మా దృష్టికి రాలేదు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న మమ్మల్ని ప్లాంట్‌ ను మీరే కొంటారా అని ఎలా అడుగుతారు...? అలాగే, ప్రైవేటీకరణ వద్దని కేసీఆర్‌ చెప్పినప్పుడు ఆయనే మళ్లీ కొనేందుకు ముందుకొస్తున్నారని మీరు ఎలా చెబుతారు..

మీ మీడియాల్లో ఎలా రాస్తారు..? రాజకీయంగా ఇలాంటివి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వస్తుంటాయి. వాటన్నింటినీ పట్టించుకుని మేం స్పందించలేం కదా.. ! వాస్తవానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌ ఏదైనా మాట్లాడితే.. వాళ్ల స్టాండ్‌ ఏంటో తెలిశాక అప్పుడు మేం స్పందించడం కరెక్టు గానీ, రాజకీయ దుమారం రేపే గాలివార్తలపై మేం ఇప్పుడే ఏమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముమ్మాటికీ విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌గానే మేం భావిస్తున్నాం.. ఆ మేరకు ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయొద్దన్న విధానంపైనే మా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉంది’ అని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top