వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ | Vizag Airport Flight Services Reaching Fifty | Sakshi
Sakshi News home page

వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌

Nov 3 2021 10:13 AM | Updated on Nov 4 2021 9:23 AM

Vizag Airport Flight Services Reaching Fifty - Sakshi

విశాఖ విమానాశ్రయం నుంచి ఒకట్రెండు సర్వీసులతో కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. విమాన ప్రయాణం వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి మే లో 143 విమానాలు రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం సుమారు 1300 ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ నడుస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖ ఎయిర్‌పోర్టు.. వరుస సర్వీసులతో దూసుకుపోతోంది. కోవిడ్‌ నుంచి కోలుకుని విమాన సర్వీసులను ఒక్కొక్కటిగా పెంచుకుంటూ పోతూ.. హాఫ్‌ సెంచరీ మార్క్‌కు చేరుకుంది. రాత్రి సమయంలోనూ ఢిల్లీ, బెంగళూరుకు వెళ్లేందుకు మరో రెండు సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే దుబాయ్‌కు కూడా విమాన సర్వీసు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నౌకాదళ అనుమతులు వస్తే.. జంబో ఫ్లైట్‌గా పిలిచే డ్రీమ్‌లైనర్‌ సర్వీసు కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దేశీయ విమానాల రాకపోకలు మొదలైన తొలినాళ్లలో ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థలు కూడా ఆలోచనలో పడ్డాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ఒకట్రెండు సర్వీసులతో కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రమంగా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించడంతో.. విమాన ప్రయాణం వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచి మే లో 143 విమానాలు రాకపోకలు సాగించగా.. ప్రస్తుతం సుమారు 1300 ఫ్లైట్‌ ఆపరేషన్స్‌ నడుస్తున్నాయి. మేలో కేవలం 7,989 మంది మాత్రమే ప్రయాణాలు సాగించారు. ఆ తర్వాత నుంచి రాకపోకలు పుంజుకున్నాయి. అక్టోబర్‌లో ఏకంగా సుమారు 1.55 లక్షల మంది విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణాలు సాగించారు.

చదవండి: (ఉద్యోగుల జీతాలు ఎక్కడా ఆగలేదు)
 
హాఫ్‌ సెంచరీ దాటిన సర్వీసులు 
1981లో రోజుకు ఒక విమానం ద్వారా ఇక్కడ పౌర సేవలు ప్రారంభమయ్యాయి. సివిల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌లకు 85 రన్‌ వే కెపాసిటీగా విధించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉన్నప్పుడు 80 విమానాలు రాకపోకలు సాగించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో కోవిడ్‌కు ముందు వరకు 66 విమానాల రాకపోకలు సాగించాయి. కోవిడ్‌ కారణంగా సర్వీసులన్నీ రద్దయ్యాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అన్‌లాక్‌ ప్రక్రియ తర్వాత క్రమంగా ఒక్కో సర్వీసు పెరుగుతూ వచ్చింది.  నెల కిందటి వరకు 36 సర్వీసులతో నడవగా.. ఇప్పుడు ఏకంగా 50 మార్కుకు చేరుకుంది. ఇదే దూకుడు కొనసాగితే రానున్న రెండు నెలల్లో గరిష్ట మార్కు 66కు చేరుకునే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. 

రాత్రి వేళల్లోనూ రాజధానికి ప్రయాణం 
ఫ్లైట్‌ ఆపరేషన్లు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే సర్వీసులు క్రమంగా పెరుగుతున్నాయి. డిసెంబర్‌ నుంచి తొలిసారిగా తిరుపతికి నేరుగా విమానయానం ప్రారంభం కానుంది. రాత్రి వేళల్లోనూ సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా నెలల తర్వాత సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. విశాఖ నుంచి ఢిల్లీ, బెంగళూరుకు నైట్‌ సర్వీసులు మొదలయ్యాయి. ఇవి క్రమంగా మిగిలిన ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉందని విమానాశ్రయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే విధంగా త్వరలోనే దుబాయ్‌కు విమాన సర్వీసు ప్రారంభం కానుందని వెల్లడించాయి.

డ్రీమ్‌లైనర్‌ కోసం ఎదురుచూపులు 
ప్రస్తుతం ఉన్న సౌకర్యాల ప్రకారం 300 మంది ప్రయాణికులతో నడిచే భారీ విమానం డ్రీమ్‌లైనర్‌ తరహా ఫ్లైట్‌ సర్వీసులను నడిపేందుకు ఎయిర్‌పోర్టు వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరింత విస్తరిస్తే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇందుకు నౌకాదళం అనుమతి కచ్చితంగా అవసరం. ఎయిర్‌పోర్టు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) మొత్తం నౌకాదళ ఆధీనంలో ఉండటం వల్ల వేచి చూడాల్సి వస్తోంది. ఈ కల నెరవేరే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇది విజయవంతమైతే విశాఖ వీధుల్లోంచి భారీ విమానం రయ్‌మని దూసుకెళ్లే అవకాశం ఉంది. ఆ రోజు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. 

చదవండి: ('ఆర్బీకేల్లో' దండిగా ఎరువులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement