
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్ట్ ట్రస్ట్ వెస్ట్ క్యూ 5 బెర్త్‌లోని కోస్టల్ షిప్పింగ్ బోటులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి పనామా బిడి 51 నౌక నిన్న (శనివారం) రాత్రి విశాఖ పోర్టుకు చేరుకుంది. నౌకల్లోకి సిబ్బందిని మార్చేందుకు ఈ కోస్టల్ షిప్ ను వినియోగిస్తారు. ఈ రోజు మధ్యాహ్న సమయంలో షిప్ క్యాబిన్ రూమ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన నౌకా సిబ్బంది పోర్ట్ అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఇది స్వల్ప ప్రమాదమేనని పోర్టు ట్రస్ట్ యాజమాన్యం తెలిపింది. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని పోర్ట్ ఉన్నతాధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనాకొచ్చారు.
(మంటల్లో చిక్కుకున్న చేపల బోటు, అంతా సేఫ్)