
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.
బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్‌లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.