మహాకాయ.. అభయమీయవయా!

Vinayaka Chavithi: All Set For kanipakam Vinayaka Temple - Sakshi

సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా.

కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు.. సుగంధ పరిమళాలను వెదజల్లే సుమమాలికలతో కనువిందు చేస్తోంది. 21 రోజులపాటు ఏకాంతంగా సాగే ఉత్సవాలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కోవిడ్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తోంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసింది. కొరత లేకుండా గణనాథుని లడ్డూ ప్రసాదాలను తయారు చేసింది. 

ప్రత్యేక ఏర్పాట్లు 
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేర్వేరు క్యూలను ఏర్పాటు చేశారు. అందులో రూ.50, రూ.100 దర్శన టికెట్‌ కొనుగోలు చేసిన వారికి విడిగా ఆలయం వెలుపల నుంచి క్యూ నిర్మించారు. వీఐపీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోవైపు క్యూ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్యూలో లైట్లు, ఫ్యాన్లు, శానిటైజర్, తాగునీటి సౌకర్యం కల్పించారు. 
భక్తులకు అన్నదానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయంలో 5వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే కోవిడ్‌ కారణంగా భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 

సిద్ధంగా ప్రసాదం 
బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు కొరత లేకుండా స్వామివారి ప్రసాదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 60 వేల రూ.15 లడ్డూలు, 5వేల రూ.75 లడ్డూలు, 2వేల రూ.150 లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సెల్‌ఫోన్లు భద్రపరిచేందుకు, పాదరక్షలు పెట్టుకునేందుకు పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేయనున్నారు. 

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం 
చవితి రోజున కేవలం సామాన్య భక్తులనే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు 11వ తేదీన దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. కోవిడ్‌ కారణంగా వాహనసేవలు, అభిషేకాలకు 50 మంది ఉభయదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గణేశ దీక్ష చేపట్టేవారి కోసం వరదరాజస్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 


భారీ బందోబస్తు 
బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కలి్పంచారు. నలుగురు సీఐలు, 9 మంది ఎస్‌ఐలు, 130 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించారు.  ఆలయ పరిసరాల్లో 32 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా చవితి వేడుకలు 
ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని వినాయక సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ  హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. పూజా కార్యక్రమంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని చెప్పారు. చవితి మండపాల వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top