ధర్మపరిరక్షణకు ప్రభుత్వం కృషి

Vellampalli Srinivas Comments On Hindhu Dharma Parirakshana by AP Govt - Sakshi

వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుకు తోడ్పాటు

ధార్మికసంస్థలు, పీఠాలకు భూముల కేటాయింపు

ఆర్యవైశ్యులకే ‘వాసవి’ సత్రాల నిర్వహణ 

మంత్రి వెలంపల్లి

సాక్షి, అమరావతి: హైందవధర్మ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. వేద, సంస్కృత పాఠశాలల ఏర్పాటుతోపాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ధార్మికసంస్థలు, పీఠాలకు భూములు కేటాయిస్తున్నట్టు తెలిపారు. విశాఖ శారదాపీఠానికి, అనంతపురంలో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి భూమి ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ధర్మప్రచారానికి ముందుకొస్తున్న ప్రభుత్వంపై పచ్చపత్రికలు కుట్ర పూరితంగా విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.

స్వామీజీలకు కూడా రాజకీయాలను ఆపాదించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వాల్లో కూడా పీఠాధిపతుల కోరిక మేరకు స్థలాలు కేటాయించారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో కావూరి సాంబశివరావుకు అప్పనంగా 400 ఎకరాలు ఇచ్చారని, విశాఖలో లోకేశ్‌ భూములను పంచిపెట్టినప్పుడు పచ్చపత్రికలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఈషా ఫౌండేషన్‌కు చంద్రబాబు స్థలం ఇస్తానని ప్రకటించగానే ఫౌండేషన్‌కు గొప్ప అవకాశం కల్పిస్తున్నారంటూ వార్తలు రాయలేదా అని నిలదీశారు. 

ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ
వాసవీకన్యకాపరమేశ్వరి సత్రాలు, అన్నదాన సత్రాలపై ప్రభుత్వ అజమాయిషీని తగ్గిస్తూ వాటి నిర్వహణను ఆర్యవైశ్యులకే అప్పగించేలా తీర్మానాన్ని కేబినెట్‌ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారని కొనియాడారు. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చారన్నారు. ఆయన తనయుడిగా సీఎం జగన్‌ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను అమ్ముకోవడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంత నిధులతో నిర్మించుకున్న దేవాలయాలు, సత్రాల నిర్వహణలో ఆర్యవైశ్యులకు పూర్తిస్వేచ్ఛ లభించిందన్నారు.

సీఎంకు ఆర్యవైశ్య సంఘం ధన్యవాదాలు
సీఎం వైఎస్‌ జగన్‌ని ఏపీ ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు  గురువారం కలిశారు. ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసినందుకు సచివాలయంలో సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో మంత్రి వెలంపల్లి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఎం. ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం విజయవాడ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు కె.విద్యాధరరావు తదితరులున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top