రైతులకు యూసీఐఎల్‌ అన్యాయం చేస్తోంది

Uranium Project Affected Villages Meet YSR Kadapa Collector - Sakshi

అందని పరిహారం, ఉద్యోగాలు

ప్రజాభిప్రాయ సేకరణ వద్దు

కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలి

కలెక్టర్‌ను కలిసిన యురేనియం బాధిత గ్రామాల ప్రజలు

సాక్షి, కడప సిటీ: ‘యురేనియం ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదు.. ప్రారంభంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగడం లేదు. బాధితులకు పరిహారం, ఉద్యోగాలు అందలేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులను చేయడం లేదు. వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని వేముల మండలం తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, మబ్బుచింతలపల్లె, కేకే కొట్టాల, కనంపల్లె, వేల్పుల తదితర యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్‌ సి.హరి కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వందలాది మంది బాధిత గ్రామాల ప్రజలు కడప కలెక్టర్‌ కార్యాలయానికి తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

డిమాండ్ల పరిష్కారం కోసం వేముల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గత ఐదు రోజులపాటు ఆందోళనలు చేపట్టినా యూసీఐఎల్‌ యాజమాన్యం కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. అభివృద్ధి పనులను విస్మరించారన్నారు. 70 శాతం ఉద్యోగాలు యురేనియం బాధిత ప్రాంత రైతులకే కేటాయించాలన్నారు. సరిహద్దులు నిర్ణయించిన మేరకు భూములన్నీ తీసుకోవాలన్నారు. టైలింగ్‌పాండ్‌ వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతోందని, కలుషిత నీటితో పంటలు దెబ్బతినడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పర్యవేక్షణ బావులు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలన్నారు. భూగర్భ జలాలు శుద్ధి చేస్తేగానీ పంటలు పండవన్నారు.

అంతవరకు రైతులకు నష్టపోయిన పంట నష్టాన్ని నిరంతరాయంగా చెల్లిస్తూనే ఉండాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం కోల్పోయిన రైతులందరికీ తగు రీతిలో ఉపాధి కల్పించాలన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారంతోపాటు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దని, బాధిత గ్రామాల్లోని రైతులతో కమిటీ వేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ హరికిరణ్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్‌ హరికిరణ్‌ స్పందించారు. త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యురేనియం బాధిత గ్రామాల నాయకులు, వైఎస్సార్‌సీపీ వేముల మండల కన్వీనర్‌ నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

డిమాండ్లన్నీ పరిష్కరిస్తేనే... 
డిమాండ్లు పరిష్కరించమంటే యురేనియం ప్రాజెక్టు యాజమా న్యం కాలయాపన చేస్తోంది. అన్ని డిమాండ్లు పరిష్కరిస్తేనే యురేనియం బాధిత గ్రా మ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చే స్తాం. ప్రజాభిప్రాయసేకరణ అసలు ఒప్పుకోం. కమిటీ వేసి సమస్యలన్ని పరిష్కరించాలని కోరుతున్నాం.
– మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ, రాచగుంటపల్లె, వేముల మండలం

ప్రజాభిప్రాయ సేకరణ వద్దు 
యురేనియం ప్రాజెక్టు యాజమాన్యం జనవరి 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. దీనికి  ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ముందుకు వెళితే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తాం. యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో కమిటీ ఏర్పాటు చేసి డిమాండ్లను పరిష్కరిస్తేనే అంగీకరిస్తాం. 
– నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల కన్వీనర్, వేముల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top