‘మందు’ మార్బలానికే! | Unilaterally extends TDP liquor shops licenses for two years: AP | Sakshi
Sakshi News home page

‘మందు’ మార్బలానికే!

May 15 2026 4:56 AM | Updated on May 15 2026 4:56 AM

Unilaterally extends TDP liquor shops licenses for two years: AP

టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టేద్దాం 

చంద్రబాబు సర్కారు పన్నాగం  

3,736 మద్యం దుకాణాల లైసెన్సుల ఏకపక్ష రెన్యూవల్‌!? 

నోటిఫికేషన్‌ లేకుండానే కట్టబెట్టేందుకు ఎత్తుగడ 

ముఖ్యనేత ఆదేశాలతో ఎక్సైజ్‌ శాఖ సన్నద్ధం  

సాక్షి, అమరావతి : టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీ స్పీడ్‌ పెంచాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం టీడీపీ మద్యం సిండికేట్‌ నిర్వహిస్తున్న మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను ఏకపక్షంగా రెండేళ్లపాటు పొడిగించేందుకు ఎత్తుగడ వేసింది. తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసి పారదర్శకంగా లైసెన్సులు కేటాయించే ప్రక్రియను పక్కనపెట్టాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం. అందుకోసం ముఖ్య నేత ఆదేశాలతోనే ఎక్సైజ్‌ శాఖ సన్నద్ధమవుతోంది.  

సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు రెన్యూవల్‌...! 
2024 నుంచి చేస్తున్న మద్యం దోపిడీని కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకే ప్రస్తుతం టీడీపీ సిండికేట్‌ గుప్పిట్లో ఉన్న రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్‌ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలకు అనుమతించిన రెండేళ్ల లైసెన్సు గడువు ఈ ఏడాది అక్టోబరు మొదటివారంతో ముగుస్తోంది. సెపె్టంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసి తాజాగా లైసెన్సులు కేటాయించాలి. ఆసక్తి ఉన్నవారు అందరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి. ఈ పారదర్శక విధానాన్ని విస్మరించి ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు లైసెన్సులు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.   ఈమేరకు ప్రభుత్వ ముఖ్యనేత స్థాయిలోనే సూత్రపాయంగా నిర్ణయించారు.

ఎందుకంటే రాష్ట్రంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ కూటమి సిండికేట్‌ గుప్పిట్లోనే ఉన్నాయి. అందుకే ఆ సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు ఏకపక్షంగా మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయించాలని భావిస్తున్నారు. అందుకు ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. కాగా 2024లో లైసెన్సుల కోసం దరఖాస్తుల ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చింది. లైసెన్సు ఫీజు రూపంలో వచ్చిన ఆదాయానికి ఇది అదనం. ప్రస్తుతం మద్యం దుకాణాల లైసెన్సులను రెన్యూవల్‌ చేస్తే.. లైసెన్సు ఫీజు వస్తుంది. కానీ 2024లో దరఖాస్తు ఫీజుల రూపంలో వచ్చిన రూ.1,800 కోట్లను కూడా సర్దుబాటు చేసేందుకు అవకాశం ఉందా అన్న విషయాన్ని పరిశీలించాలని ఎక్సైజ్‌ శాఖకు సూచించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకుని టీడీపీ మద్యం సిండికేట్‌కే మరో రెండేళ్లపాటు లైసెన్సులు ఏకపక్షంగా పొడిగించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.  

గతంలోనూ లాటరీ ముసుగులో టీడీపీ సిండికేట్‌కు...
2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ఆ స్థానంలో మొత్తం 3,736 ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు 2024 అక్టోబరులో నోటిఫికేషన్‌ జారీ చేసింది. లాటరీ విధానం ముసుగులో టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా లైసెన్సులు కట్టబెట్టింది. సిండికేట్‌ సభ్యులకు కాకుండా ఇతరులు ఎవరూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయకుండా పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులతో బెదిరించారు.

ఇక ఆ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా 75వేల బెల్ట్‌ దుకాణాలను నిర్వహిస్తూ మద్యం ఏరులై పారిస్తున్నారు. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. 2014–19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో మద్యం దోపిడీ విధానం ముసుగులో రూ.25వేల కోట్ల దోపిడీ పాల్పడిన టీడీపీ సిండికేట్‌... ప్రస్తుతం 2024–29 కూటమి ప్రభుత్వ హయాంలో అంతకు రెట్టింపు దోపిడీకి గురి పెట్టింది. అందుకోసమే టీడీపీ సిండికేట్‌కే మద్యం దుకాణాల లైసెన్సులను మరో రెండేళ్లపాటు పొడిగించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మద్యం పాలసీ ముసుగులో మంత్రి మండలిలో ఆమోదించి ఈ దోపిడీ విధానానికి రాజముద్ర ముద్ర వేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగం. అదీ సంగతి.  

Advertisement
 
Advertisement
Advertisement