అప్పన్న కొండకు గుండు! | Uncontrolled excavations on Simhachalam Hill in the name of data center | Sakshi
Sakshi News home page

అప్పన్న కొండకు గుండు!

May 15 2026 5:06 AM | Updated on May 15 2026 5:06 AM

Uncontrolled excavations on Simhachalam Hill in the name of data center

నరసింహస్వామి కొలువైన క్షేత్రానికే ఎసరు

డేటా సెంటర్‌ పేరుతో సింహాచలం కొండపై విచ్చలవిడిగా తవ్వకాలు

తీవ్ర అపచారమని భక్తుల ఆందోళన

కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం బంద్‌

ముడసర్లోవకు తీవ్ర నీటి ఎద్దడి ముప్పు.. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటుకూ తిప్పలే

ప్రైవేట్‌ రిసార్టుల కోసం పావురాల కొండపై అడ్డగోలుగా తవ్వకాలు

క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి ప్రాచీన బౌద్ధం ఆనవాళ్లు సమాధి

లీజుల పేరుతో చంద్రబాబు సర్కారు అనాలోచిత చర్యలు

దశాబ్దాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలు కనుమరుగు

పర్యావరణ సమతుల్యతకు తీవ్ర విఘాతం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు

ఈ ఫొటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్‌ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వే స్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ‘చప్టా’ కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకూ నీటి ఎద్దడి ఏర్పడనుంది.

భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్‌ రిసార్టుకు భూమి కేటాయించడంతో భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి పిండి చేస్తున్నారు. దీంతో బౌద్దం ఆనవాళ్లు కానరాకుండా పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండపై అపచారం..! నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రా­నికే ఎసరు..! అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా.. ఇప్పుడు ఆర్‌కే బీచ్‌ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలనూ వదలడం లేదు. ప్రైవేట్‌ రిసార్టులు, డేటా సెంటర్‌ పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేటు రిసార్టులు దర్శనమివ్వను­న్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


ముడసర్లోవకు నీటి ముప్పు...!
సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని (సింహాచలం కొండ) డేటా సెంటర్‌ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హను­మంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నా­రు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచార­మని హెచ్చరిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచ­లం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడస­ర్లోవలోకి వస్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడస­ర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్‌టీఎస్‌ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. 

భీమిలిలోని పావురాల కొండను తవ్వేస్తున్నారిలా..  

తాజాగా జరుగు­తున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వేసవి కాలంలో పీక్‌ సీజన్‌లోనూ ఈ కాలనీలకు నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60–70 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముడసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లకు కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రైవేట్‌ రిసార్టుల కోసం పావురాల కొండ...!
బీచ్‌ రోడ్డులో భీమిలికి వెళ్లే మార్గంలో కొత్తవలస వద్ద క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్న పావురాల కొండ ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాచీన బౌద్ధ నిధిగా వ్యవహరి­స్తుంటారు. ఈ కొండను ఇప్పుడు ప్రైవేట్‌  రిసా­ర్టుల కోసం కేటాయించారు. క్రీస్తుపూర్వం 3వ శతా­బ్దం నాటి బౌద్ధ నిధి ఆనవాళ్లను చంద్రబాబు ప్రభు­త్వం భారీ యంత్రాలతో తొలిచే యత్నం చేస్తోంది. పావురాల కొండ ఉన్న కొత్తవలస రెవెన్యూ పరి­ధిలో 15 ఎకరాలను ప్రైవేటు రిసార్టు కోసం ధారా­దత్తం చేశారు. ఈ మేరకు 2025 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం 39) జారీ చేసింది. 66 ఏళ్ల లీజుతో పాటు మరో 33 ఏళ్లు పొడిగించే వెసులుబాటుతో మొత్తం 99 ఏళ్లకు మైరా బే వ్యూ రిసార్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ సంస్థకు కట్టబెట్టింది. దీని కోసం పావురాల కొండను అడ్డంగా తవ్వేస్తున్నారు. 

ప్రైవేటు రిసార్టుల కోసం పావురాలకొండలోని 15 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ 

పర్యావరణ సమతుల్యత దెబ్బ­తినడంతో పాటు ప్రభుత్వం ప్రాచీన బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. పక్కనే మిగతా కొండలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టి పిండి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఇప్పటికే ఎండాడలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ బంధువైన గీతం యజమాని, విశాఖ ఎంపీ భర­త్‌కు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దలు మరోవైపు కొండలన్నింటినీ ప్రైవేట్‌ రిసార్టుల కోసం తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement