వ్యర్థానికి అర్థం.. ఏపీ ప్రభుత్వ కృషి ఫలితం

Two power generation plants near Visakhapatnam and Guntur - Sakshi

గుంటూరులో రేపు సీఎం చేతుల మీదుగా వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభం

విశాఖ, గుంటూరు నగరాల సమీపంలో రెండు విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లు 

రోజుకు 1,600 టన్నుల ఘన వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి 

సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లోని ఘన వ్యర్థాలను సేకరించి వీలైనంత మేర పునర్‌ వినియోగానికి అనువుగా మానవాళికి ఉపయోగపడేలా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్న సంకల్పంతో గుంటూరు, విశాఖపట్నం నగరాల సమీపంలో ఏర్పాటు చేసిన రెండు జిందాల్‌ ఎకోపోలిస్‌ పవర్‌ ప్లాంట్లలో ఒక దానిని మంగళవారం అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రోజుకు 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అందుకు అనుగుణంగా గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలోని ప్లాంట్‌ వద్ద ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ప్లాంట్‌లో కొన్ని నెలలుగా భారీ స్థాయిలో చెత్తను మండించి సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి రోజుకు 1,600 టన్నుల చెత్త అవసరం కాగా, ప్రస్తుతం సమీపంలోని పట్టణాల నుంచి 830 టన్నులు మాత్రమే వస్తోంది.

గతంలో ఈ ప్లాంట్‌ గరిష్టంగా 11 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకుంది. అయితే, ప్లాంట్‌ అవసరాలు తీర్చేందుకు మరికొన్ని పట్టణాల నుంచి కూడా చెత్తను ఇక్కడకు తరలించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు యోచిస్తున్నారు. జిందాల్‌ వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కంలు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల నుంచి ప్రతిరోజు సుమారు 6,900 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్టు క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమం ద్వారా తెలుస్తోంది. ఆ చెత్తను వీలైనంత మేర పర్యావరణానికి హాని కలగని రీతిలో ప్రాసెస్‌ చేసి అర్థవంతంగా మార్చేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.  

రూ.640 కోట్లతో ప్లాంట్లు 
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నట్టు నీతి ఆయోగ్‌ పేర్కొంది. ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారాయని, జీవజాలం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో ఘన వ్యర్థాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ పద్ధతుల్లో అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.

దాంతో ఆంధ్రప్రదేశ్‌లో రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు జిందాల్‌ ఎకోపోలిస్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు, వాటికి అవసరమైన చెత్తను సమీపంలోని మునిసిపాలిటీల నుంచి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు రెండు ప్రాంతాల్లో మొత్తం 30 మెగావాట్ల (15+15) సామర్థ్యంతో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆయా సంస్థలకు అవసరమైన చెత్తను సమీప మునిసిపాలిటీల నుంచి అందిస్తున్నారు.

ఇక్కడ పర్యావరణానికి హాని కలగని రీతిలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ప్లాంట్ల డిమాండ్‌ మేరకు మరింత చెత్తను గ్రామాల నుంచి కూడా సేకరించి అందించాలని యోచిస్తున్నారు. కాగా, త్వరలో రాజమండ్రి వద్ద మరో 7.5 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే మరో 400 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను మండించి విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top