అంగరంగ వైభవంగా గరుడోత్సవం

TTD Garudotsavam in full glory At Tirumala - Sakshi

గరుడ వాహనంపై విశ్వపతి దివ్యదర్శనం 

గోవిందనామ స్మరణతో మార్మోగిన తిరుమల గిరులు 

ఉదయమే భక్తులతో నిండిపోయిన గ్యాలరీలు 

మకరకంఠి.. లక్ష్మీహారం.. సహస్రనామ కాసులమాల విశేషాలంకరణతో గరుడోత్సవం 

నేడు స్వర్ణ రథోత్సవం

తిరుమల: విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు.

ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్టు పురాతన బ్రాస్‌లెట్‌ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్‌ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలు (గొడుగులు) అలంకరించారు. గరుత్మంతుడితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది.

స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి తరించిన లక్షలాది మంది భక్తులు ఆనంద పరవశులయ్యారు.  గోవిందా.. గోవిందా ... నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ  చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌ స్వయంగా పర్యవేక్షించారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. 

భక్తజన సంద్రంలో తిరుమలకొండ.. 
ఇక గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధంచేసిన గ్యాలరీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకే భక్తులు కిక్కిరిసి కనిపించారు. భక్తులు మాడ వీధుల్లోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేయడంతో గందరగోళానికి గురయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు కూడా నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు.  

శ్రీవారి దర్శనానికి 14 గంటలు 
మరోవైపు.. క్యూ కంపార్ట్‌మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,382 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీలో రూ.2.85 కోట్లు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం విశేషం. 

మోహిని అవతారంలో గోవిందుడు 
మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి. రాజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఎన్నడూలేని విధంగా ‘గరుడ’ దర్శనం 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున ఎన్నడూ లేని విధంగా భక్తులను వాహనం వద్దకు తీసుకొచ్చి గరుడ వాహన దర్శనం చేయించారు. ఆయా గేట్ల వద్దనున్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామివారి వాహన సేవకు అనుమతించారు. ప్రతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించారు. అదేవిధంగా గ్యాలరీల్లో రెండు లక్షల మంది, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం 
కల్పించారు. 

గరుడ వాహన సేవలో సీజేఐ 
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 
జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆయనను లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో ఘనంగా సత్కరించారు.

అలాగే, ఉదయం జగన్మోహిని వాహనాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాజ మోశారు. దీనికి ముందు తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్నారు.  కేంద్రమంత్రి భగవత్‌ కుబా, కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుల చైర్మన్‌ సతీష్‌రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. 

నేడు స్వర్ణరథం ఊరేగింపు 
తిరుమలలో ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) నిర్వహిస్తారు. సుమారు రూ.30 కోట్లతో తయారుచేసిన ఈ స్వర్ణరథాన్ని 2013 నుంచి ఉత్సవాల్లో ఊరేగిస్తున్నారు. సా.4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top