breaking news
garudotsavam
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
-
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
-
తిరుమలలో నేడు గరుడ వాహన సేవ
-
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రేపు గరుడోత్సవం..భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!
-
అంగరంగ వైభవంగా గరుడోత్సవం
తిరుమల: విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. లక్షలాది మంది భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకుని ఆనందపరవశులయ్యారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని జగాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. ఉత్కృష్టమైన ఈ గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్టు పురాతన బ్రాస్లెట్ వంటి ఎన్నెన్నో విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలు (గొడుగులు) అలంకరించారు. గరుత్మంతుడితో స్వామికి ఉన్న అనుబంధాన్ని ఈ వాహన సేవ లోకానికి తెలియజేస్తోంది. స్వామి వైభోగాన్ని కళ్లారా చూసి తరించిన లక్షలాది మంది భక్తులు ఆనంద పరవశులయ్యారు. గోవిందా.. గోవిందా ... నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ప్రారంభం నుంచి ముగిసే వరకు వాహనాన్ని తిప్పుతూ భక్తులందరూ ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్ఓ నరసింహ కిషోర్ స్వయంగా పర్యవేక్షించారు. వాహన సేవల ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల వేషధారణలు, నగర సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. భక్తజన సంద్రంలో తిరుమలకొండ.. ఇక గరుడ వాహన సేవ దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఉదయం నుంచే గ్యాలరీల్లో పడిగాపులు కాశారు. రెండు లక్షల మంది కూర్చునే విధంగా సిద్ధంచేసిన గ్యాలరీల్లో మధ్యాహ్నం ఒంటిగంటకే భక్తులు కిక్కిరిసి కనిపించారు. భక్తులు మాడ వీధుల్లోకి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడిచేయడంతో గందరగోళానికి గురయ్యారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు కూడా నడిచి వచ్చే భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ భక్తులకు త్వరగా దర్శనం కల్పించారు. శ్రీవారి దర్శనానికి 14 గంటలు మరోవైపు.. క్యూ కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,382 మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు హుండీలో రూ.2.85 కోట్లు కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం విశేషం. మోహిని అవతారంలో గోవిందుడు మరోవైపు.. బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శనివారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. రాజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నడూలేని విధంగా ‘గరుడ’ దర్శనం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజున ఎన్నడూ లేని విధంగా భక్తులను వాహనం వద్దకు తీసుకొచ్చి గరుడ వాహన దర్శనం చేయించారు. ఆయా గేట్ల వద్దనున్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామివారి వాహన సేవకు అనుమతించారు. ప్రతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించారు. అదేవిధంగా గ్యాలరీల్లో రెండు లక్షల మంది, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి భక్తులను రెండవసారి అనుమతించడం ద్వారా మరో 25 వేల మందికి అదనంగా దర్శనం కల్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, రాంభగీచ వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. గరుడ వాహన సేవలో సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఆయనను లడ్డూ ప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. అలాగే, ఉదయం జగన్మోహిని వాహనాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజ మోశారు. దీనికి ముందు తిరుమల శ్రీవారిని వారు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి భగవత్ కుబా, కేంద్ర రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుల చైర్మన్ సతీష్‌రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నేడు స్వర్ణరథం ఊరేగింపు తిరుమలలో ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం (రథరంగ డోలోత్సవం) నిర్వహిస్తారు. సుమారు రూ.30 కోట్లతో తయారుచేసిన ఈ స్వర్ణరథాన్ని 2013 నుంచి ఉత్సవాల్లో ఊరేగిస్తున్నారు. సా.4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో స్వర్ణరథాన్ని ఊరేగించనున్నారు. -
ఘనంగా ప్రహ్లాదవరదుడి గరుడోత్సవం
– గోవిందా నామస్మరణతో మారుమోగిన అహోబిలక్షేత్రం అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిల బ్రహ్మోత్సవాల చివరి రోజైన సోమవారం అర్ధ రాత్రి దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి గరుడోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. తర్వాత గరుడ వాహనము పై కొలువుంచి దిగువ అహోబిలంలోని మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవం మంగళవారం తెల్లవారు జామున వరకు సాగింది. స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి సుమారు లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అంచనా. దీంతో దిగువ అహోబిల క్షేత్రం గోవిందా నామస్మరణతో పులకించి పోయింది. శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభ దశలో సకలదేవతలను ఆహ్వానిస్తూ.. ముగింపు రోజు సకదేవతలను సాగనంపుతూ ధ్వజావరోహణం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అహోబిలం పీఠాధిపతి శ్రీమాన్ శఠకోప యతీంద్ర మహాదేశికన్, ముద్రకర్త «శ్రీమాన్ శఠకోపం వేణుగోపాలన్, కార్యనిర్వాహణాధికారి మల్లిఖార్జునప్రసాదుల ఆధ్వర్యంలో వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. -
వైభవం.. గరుడోత్సవం
– ధ్వజారోహనము తో ముగిసిన ఎగువ అహోబిల బ్రహ్మోత్సవం – ఆకట్టుకున్న స్వామి బావమరుదుల(చెంచుల) ఆటపట్టించే కార్యక్రమాలు అహోబిలం(ఆళ్లగడ్డ) అహోబిల బ్రహ్మోత్సవాల చివరి రోజు ఆదివారం అర్ధరాత్రి ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలనరసింహస్వామి గరుడోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన స్వామిని అర్ధరాత్రి అనంతరం విశేష పూలాంకరణ గావించిన గరుడ వాహనము పై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గరుడ మహోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారు జామున వరకు సాగాయి. అంతకు ముందు ఉదయం ఉత్సవం, సాయంత్రం ద్వాదశారథనం నిర్వహించిన అనంతరం రాత్రి గరుడోత్సవం నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలం బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ధ్వజావరోహనము చేపట్టారు. ఆకట్టుకున్న స్వామిని ఆటపట్టించే కార్యక్రమాలు చెంచులక్ష్మీ అమ్మవారిని శ్రీ జ్వాలనరసింహస్వామి పరిణయమాడటంతో వరుసకు బావగా భావించే చెంచులు నూతన పెండ్లి కొడుకైన స్వామిని సంప్రదాయంగా ఆటపట్టించారు. ఇందులో భాగంగా గరుడవాహనము పై ఆశీనులైన స్వామి మేలిమి ఆభరణాలు ఎత్తుకెళ్లి దాచడం, అర్చకులను ఆటపట్టించడం, వారిని ఎత్తుకెళ్లడం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.