శుభ్రతకు 'క్లాప్‌' కొడదాం

Training by master trainers and resource persons on household garbage collection - Sakshi

‘క్లీన్‌ ఏపీ’ని విజయవంతం చేసేందుకు మెప్మా సన్నద్ధం

ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ

21.19 లక్షల మంది డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం

ఇంటింటి చెత్త సేకరణపై మాస్టర్‌ ట్రైనర్లు, రిసోర్స్‌పర్సన్ల ద్వారా శిక్షణ

సాక్షి, అమరావతి: పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు రూపొందించిన ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సన్నద్ధమవుతోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కోసం ముందుగా పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు ఇంటింటి నుంచి చెత్త సేకరణపై విస్తృత అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 21.19 లక్షల మంది పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పించింది. వీరికి రెండంచెల శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా నిర్వహిస్తోంది. వార్డు సచివాలయాల కేంద్రంగా కార్యాచరణ చేపట్టింది. ముందుగా ప్రతి మున్సిపాలిటీకి ఒకరుతోపాటు ఆ మున్సిపాలిటీ పరిధిలో పైలట్‌ వార్డుకు ఇద్దరు చొప్పున మాస్టర్‌ ట్రైనర్లను ఎంపిక చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, మెప్మా అధికారులు వారికి క్లాప్‌ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు.

పారిశుధ్య కార్మికులు ఇంటింటి నుంచి చెత్త సేకరించే తీరు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు మొదలైన వాటిపై వారికి అవగాహన కల్పించారు. అలాగే రాష్ట్రంలో 3,826 వార్డు సచివాలయాల పరిధిలో 7,652 మంది రిసోర్స్‌ పర్సన్లను ఎంపిక చేసిన మెప్మా.. వీరికి మాస్టర్‌ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించింది. ఈ రిసోర్స్‌ పర్సన్ల ద్వారా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వీరంతా కలసి వార్డు సచివాలయాల సిబ్బంది సహకారంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు క్లాప్‌ కార్యక్రమం గురించి వివరిస్తారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా మూడు బుట్టల్లో వేయడం, ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు వాటిని అందించడం, వీధిలో ఎక్కడా చెత్తపారేయకుండా ఉండాల్సిన అవసరం మొదలైన వాటిని వివరిస్తారు. ఇక ముందుగా డ్వాక్రా సంఘాల మహిళలు చెత్త రుసుమును స్వచ్ఛందంగా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. తద్వారా తమ ప్రాంతాల్లో శాస్త్రీయంగా పారిశుధ్య నిర్వహణ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేస్తారు.

పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలను పూర్తి పరిశుభ్ర ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి చెప్పారు. మాస్టర్‌ ట్రైనర్లకు నిర్దేశించిన యూనిఫాంలను ఆమె గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను భాగస్వాములుగా చేసుకుని క్లాప్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు.
– వి.విజయలక్ష్మి, మెప్మా ఎండీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top