అందాలలో ఆహో మహోదయం..

Tourism Developements In Visakhaptnam - Sakshi

పెట్టుబడులు ఆకర్షించేలా కొత్త పాలసీ

 సీఎం సూచనల మేరకు అధికారుల కసరత్తు

 ఎదురు చూస్తున్న పెట్టుబడిదారులు

 హోటల్స్‌.. రిసార్టులతో  కళకళలాడనున్న జిల్లా టూరిజం 

ప్రకృతి వనరుల సిరిసంపదలు ఓ వైపు.. విశ్వఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు మరోవైపు.. అంతర్జాతీయ యాత్రికులను అబ్బురపరిచే పర్యాటక సోయగాలు ఇంకోవైపు... ఇలా.. లెక్కకు మించి ప్రకృతి సంపద సొంతం చేసుకున్న విశాఖ జిల్లా.. పర్యాటక వైభవాన్ని సంతరించుకుంటోంది. గత ప్రభుత్వం ప్రకటించిన అస్తవ్యస్త టూరిజం పాలసీతో విసిగిపోయిన పెట్టుబడిదారులు.. ప్రస్తుత సర్కారు ప్రవేశపెట్టబోయే కొత్త పాలసీ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రోత్సాహకాలు.. రాయితీలతో పర్యాటక రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేలా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో కొత్త ప్రాజెక్టులు తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. – సాక్షి, విశాఖపట్నం 

సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం.. ఆర్థిక, పర్యాటక రాజధానిగా భాసిల్లేందుకు అవసరమైన కొత్త ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. త్వరలో ప్రభుత్వం ప్రకటించనున్న టూరిజం పాలసీతో పర్యాటకం పరుగులు తీయనుంది. గత ప్రభుత్వం ప్రకటించిన లొసుగుల పాలసీతో పెట్టుబడులు రాక.. పర్యాటకం చతికిలపడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని టూరిజంలో పెట్టుబడులు పెరిగేలా పాలసీని ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కొత్త విధానానికి సంబంధించి టూరిజం అధికారులు సమావేశమై.. నూతన పాలసీ గురించి వివరించారు. అయితే ఫ్రెండ్లీ పాలసీగా మార్చాలని ముఖ్యమంత్రి సూచించడంతో పర్యాటక విధానం ప్రకటించేందుకు మరో వారం రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. 

వికర్ష నుంచి.. ఆకర్షణ వైపు... 
టీడీపీ సర్కారు ప్రకటించిన టూరిజం పాలసీ.. పారిశ్రామిక వర్గాలను అంతగా ఆకర్షించలేకపోయింది. 9 మేజర్, 42 సబ్‌మేజర్‌ థీమ్స్‌గా మొత్తం 680 ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు రాయితీలతో కూడిన విధానాన్ని ప్రకటించింది. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టు వ్యయాన్ని బట్టి 5 నుంచి 15 శాతం రాయితీతో పాటు, రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీపై వందశాతం పన్ను రాయితీ కల్పిస్తామని పేర్కొంది. ఇవేమీ అమల్లోకి తీసుకురాలేదు. పర్యాటక ప్రాజెక్టుకు 21 రోజుల్లో అనుమతి ఇచ్చేలా సింగిల్‌ డెస్క్‌ విధానాన్ని అమల్లో తీసుకొస్తామని చెప్పినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. సాధారణంగా ఒక పర్యాటక రంగ ప్రాజెక్టు స్థాపించాలంటే 6 ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.

దీనికి మూడు నెలల సమయం పడుతుంది. దీని బదులు సింగిల్‌ డెస్క్‌ విధానం అమల్లోకి తీసుకొచ్చి కేవలం రెండు వారాల్లో అనుమతులిస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యలేదు. అదే విధంగా ఏదైనా సంస్థకు అందించే స్థలం విలువ ఆధారంగా 2 శాతం చొప్పున అద్దె చెల్లించాలనీ, ఆ తర్వాత ఏటా 5 శాతం చొప్పున చెల్లించాలంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిబంధన విధించింది. లీజు ముగిసే సరికి ఈ అద్దె భారీ స్థాయికి చేరుకుంటుందని పారిశ్రామికవేత్తలు పెదవి విరిచారు. ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ..ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. మరో వారం రోజుల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే నూతన టూరిజం పాలసీ పర్యాటకులతో పాటు పెట్టుబడులను ఆకర్షించేదిగా ఉండబోతోందని అధికారులు చెబుతున్నారు.

హోటల్స్‌.. రిసార్టులతో... 
జిల్లా చుట్టూ పర్యాటకానికి కావల్సినంత ప్రకృతి సంపద ఉంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. టూరిజం శాఖకు సంబంధించిన 650 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు.  

ఫ్రెండ్లీ పాలసీ.. 
టూరిజం పాలసీ దాదాపు సిద్ధమయ్యింది. పెట్టుబడులను ఆకర్షించేలా ఫ్రెండ్లీ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనల మేరకు కొత్త పర్యాటక విధానంలో మార్పులు చేస్తున్నాం. విశాఖ జిల్లా పర్యాటక ఖిల్లాగా మారుతుంది. 
– ముత్తంశెట్టి శ్రీనివాసరావు,పర్యాటక శాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top