AP: సర్కారు బడిలో ‘టోఫెల్‌’ ట్రైనింగ్‌  | Sakshi
Sakshi News home page

AP: సర్కారు బడిలో ‘టోఫెల్‌’ ట్రైనింగ్‌ 

Published Sat, Jun 24 2023 5:21 AM

TOEFL training in government school - Sakshi

మనం ఏ కార్యక్రమం తలపెట్టినా పేద వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి.  వారి పట్ల సహృదయంతో పని చేయాలి. వారి జీవితాల్లో మార్పు తేవడం  దేవుడి దృష్టిలో గొప్ప సేవ చేసినట్లే. ఇదొక సవాల్‌తో కూడుకున్న కార్యక్రమం. టోఫెల్‌ శిక్షణను కేవలం జూనియర్‌ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్‌ వన్, ప్లస్‌ టూ (ఇంటర్‌) వరకూ విస్తరించాలి. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అందుకే జూనియర్‌ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులను చేపట్టిన నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్‌’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్విసెస్‌ (ఈటీఎస్‌)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది.

సీఎం జగన్‌ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్‌’ ఇండియా చీఫ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ లెజో సామ్‌ ఊమెన్, సర్వశిక్ష అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, ఎస్సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, ఈటీఎస్‌ అసెస్‌మెంట్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రుయి ఫెరీరా, డేనియల్, యూఫిఎస్‌ లెర్నింగ్‌ సహ వ్యవస్థాపకుడు అమిత్‌ కపూర్, చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ కపిల్, వైస్‌ ప్రెసిడెంట్‌ డిజిటల్‌ సేల్స్‌ ఇండియా కే–12 రాజీవ్‌ రజ్దాన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పరిశీలించాలని ఈటీఎస్‌ బృందాన్ని ఆహ్వానించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌లు 
రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్‌ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్‌ చేస్తున్నాం. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తాం. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతాం.

బైజూస్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. 1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్‌) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తాం. టెన్త్‌ విద్యార్థులు 2025లో సీబీఎస్‌ఈ పరీక్షలకు ఇంగ్లిష్‌ మీడియంలో హాజరవుతారు.   

మానవ వనరులపై పెట్టుబడి 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయి. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతాం. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం. వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్, టోఫెల్‌ సీనియర్‌ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం. కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది.  

ఒప్పందంలో ముఖ్యాంశాలు..
టోఫెల్‌ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. 
♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్‌ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. 
♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. 
♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. 
♦  5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్‌ ప్రైమరీని నిర్వహిస్తారు. 
♦  6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష ఉంటుంది. 
 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్‌ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్‌ జూనియర్‌ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. 
♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్‌ జూని­యర్‌ స్పీకింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 
పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్‌ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు.  
 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారా­నికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. 
♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. 
♦  అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్‌ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్‌­టన్‌కు మూడు రోజులపాటు పంపిస్తారు. 
♦  ఒప్పందంలో భాగంగా టోఫెల్‌ పరీక్షలను సీనియర్‌ లెవెల్‌కూ (ప్లస్‌ –1, ప్లస్‌ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. 

ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం విద్యలో నాణ్యత పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంతోనైనా విద్యార్థులు సులభంగా అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి.

నా తల్లిదండ్రులు ఫ్రాన్స్‌కు చెందినవారు కావడంతో ఇద్దరికీ ఇంగ్లిష్‌ రాదు. నేను ఆంగ్ల భాష నేర్చుకుని అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందా. ఈటీఎస్‌ 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మాది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సంస్థ. 180 దేశాల్లో 9 వేల ప్రాంతాల్లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 52 మంది టీచర్లను అమెరికాలోని ప్రిన్స్‌టన్‌కు పంపనుంది. వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం.  – అలైన్‌ డౌమాస్, ఈటీఎస్‌ సీనియర్‌ డైరెక్టర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement