నిన్ను నమ్మం బాబూ..

Tirupati by-election further degraded the TDP - Sakshi

స్పష్టం చేసిన తిరుపతి ఓటర్లు

2019 ఎన్నికల కన్నా 5.57 శాతం తగ్గిన టీడీపీ ఓట్లు

37.65 శాతం నుంచి 32.08 శాతానికి పడిపోయిన ఓటుబ్యాంకు

జనం నమ్మని రాళ్ల రాజకీయం, దొంగ ఓట్ల డ్రామాలు

టీడీపీని మరింత దిగజార్చిన తిరుపతి ఉప ఎన్నిక

సాక్షి, అమరావతి: తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఎత్తులు పారలేదు. రాళ్ల రాజకీయం చేసినా.. ధర్నాలు చేసినా.. దొంగ ఓట్లంటూ డ్రామాలు వేసినా.. ఓటర్లు నమ్మలేదు. ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటూ స్పష్టంగా తీర్పు చెప్పారు. 2019లో జరిగిన ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్‌ స్థానంలో టీడీపీకి 37.65 శాతం ఓట్లు పడ్డాయి. అదే స్థానానికి ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి 32.08 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు రెండేళ్లలో టీడీపీ ఓటు బ్యాంకు 5.57% పడిపోయింది. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఏడాదిగా కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలను పట్టించుకోని చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం తనతోపాటు టీడీపీ శ్రేణులను రంగంలోకి దించారు.

ఒకవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన తనయుడు లోకేశ్‌తోపాటు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రంలోని టీడీపీ ఇన్‌చార్జ్‌లు వీధివీధికి తిరిగినా ప్రజల ఆదరణ దక్కలేదు. వైఎస్సార్‌సీపీ గెలుపును అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆడని డ్రామాలేదు. కోడ్‌ అమలులో ఉండగానే ఎన్నికల్లో లబ్ధి కోసం ఆయన చిత్తూరులో 5 వేలమందితో ధర్నా, నిరసనకు వెళ్లి రాజకీయ మైలేజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోవిడ్‌ నిబంధనలు, తిరుపతి ఉప ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున చంద్రబాబు ఆందోళన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి కూర్చుని తిరుపతి ప్రజల సానుభూతి కోసం ఆడిన హైడ్రామా ఆయనకు రాజకీయ మైలేజీ తేలేకపోయింది.

చివరకు బహిరంగసభలో చిన్న రాయిని పట్టుకుని.. తమపై రాళ్లు వేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ‘రాయి’ రాజకీయం రక్తికట్టలేదు. తనపై రాళ్లు విసిరి హత్యాయత్నం చేశారంటూ తిరుపతి ప్రజలను నమ్మించి సానుభూతి ఓట్లు పెంచుకోవాలన్న బాబు ఎత్తుగడ పారలేదు. అక్కడే నేలపై కూర్చుని ధర్నా చేసి దాన్ని లబ్ధిపొందాలన్న కుతంత్రం నెరవేరలేదు. చివరకు ఓట్ల వేటలో రాజకీయ మౌలిక సూత్రాలను సైతం పక్కన పెట్టి ‘వకీల్‌సాబ్‌’ పేరుతో సినిమా ట్రిక్కులకు తెరలేపారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత అయిన పవన్‌ను భుజానికెత్తుకున్న చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికలో ఆ సామాజికవర్గ ఓట్లకు గాలం వేశారు. పవన్‌ నటించిన వకీల్‌సాబ్‌ సినిమాకు రేట్లు పెంచుకునేందుకు, ఎక్కువ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు.. పవన్‌ అనుకూల ఓటు బ్యాంకును టీడీపీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించారు.

అయినా బాబు వేసిన సినిమా ట్రిక్కులు తిరుపతి ప్రజల ముందు పారలేదు. చివరకు పోలింగ్‌ రోజున అధికార పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ బీజేపీ, జనసేనలతో కలిసి చంద్రబాబు పార్టీ చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. స్వేచ్ఛగా వచ్చి ఓటేసే ప్రజలను దొంగ ఓట్ల పేరుతో బెదరగొట్టి వైఎస్సార్‌సీపీకి వచ్చే మెజారీటిని తగ్గించేందుకు చంద్రబాబు హైడ్రామా నడిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి వచ్చే అనేకమంది బయటి భక్తులను సైతం దొంగ ఓటర్లుగా చూపించి మభ్యపెట్టేందుకు చంద్రబాబు అండ్‌ కో చేసిన హడావుడికి తిరుపతి ప్రజలు గట్టి బదులిచ్చారు. చంద్రబాబు చీప్‌ ట్రిక్కులను నమ్మని తిరుపతి ఓటర్లు ఛీత్కరించడమే కాకుండా ఘోర పరాజయంతో గట్టి బదులిచ్చినట్టు అయింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top