AP: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు

Thrift Groups Women as Entrepreneurs In Andhra Pradesh - Sakshi

ప్రతీ సంఘంలో ఇద్దరిని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక

5.34 లక్షల సంఘాల్లో 16.84 లక్షల మందికి ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ

పొదుపు సంఘాలకు ఈ ఒక్క ఏడాదే మరో రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం

రుణ ప్రణాళికను ఖరారు చేసిన సెర్ప్‌ 

సాక్షి, అమరావతి: మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.42 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఇద్దరేసి చొప్పున మొత్తం 16,84,026 మంది మహిళలను గుర్తించి, వారిని పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలుగా తయారుచేసేలా ప్రణాళికను రూపొందించింది.

ఇలా గుర్తించిన వారికి ‘రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఆర్‌యూడీఎస్‌ఈటీ)లో శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఆరు ప్రధాన అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మహిళల్లో పూర్తిస్థాయి ఆర్థిక చైతన్యం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వైఎస్సార్‌ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది.

రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం
ఇక సకాలంలో రుణాలు చెల్లించిన 5.34 లక్షల పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి రూ.30 వేల కోట్ల రుణం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) లక్ష్యంగా నిర్ధేశించుకుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకర్ల సంఘం ఆమోదం తెలిపింది. మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.9,800 కోట్లు దాకా పొదుపు చేసుకున్నారు.

ఇంత పెద్ద మొత్తంలో ఉన్న తమ డబ్బును మహిళలు నామమత్రం వడ్డీ వచ్చే పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుని.. అదే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ, అలాకాకుండా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును అవసరాల మేరకు తీసుకుని ఆ తర్వాత అదనంగా అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణం పొందడం ద్వారా పెద్దగా అప్పుచేయాల్సిన అవసరం ఉండదని.. బ్యాంకులు ఇందుకు అనుమతివ్వాలని సీఎం జగన్‌  బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదించారు. ఇందుకు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని సెర్ప్‌ అధికారులు వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top