1,000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది లేదంటూనే, నమ్మించి నట్టేట ముంచే చర్యలకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. ఇటీవల ప్లాంట్‌లోని కీలకమైన ఆపరేషన్స్ విభాగం ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచిన యాజమాన్యం, ఇప్పుడు మూడో దఫా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్) అమలుకు శ్రీకారం చుట్టింది. 1,000 మందిని ఇళ్లకు పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
రెండు విడతల్లో 1,590 మంది ఉద్యోగులను సాగనంపారు. 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా తొలగించారు. మూడో విడత వీఆర్‌ఎస్ కోసం జనవరి 1 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్లాంట్ యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. వయసు 45 ఏళ్లు పైబడి... 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు అర్హులని తెలిపింది. వీఆర్‌ఎస్ పొందినవారిని తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకోమని తేల్చిచెప్పింది.
వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి ఇంకా బకాయిలే
స్టీల్ ప్లాంట్‌లో వేతనాలు సమయానికి అందకపోవడంతో పాటు ఎప్పుడు ఎంత వేతనం వస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. రెండు దఫాలలో 1,590 మంది వీఆర్‌ఎస్ పొంది మూడు, నాలుగు నెలలైంది. వీరికి ఇప్పటికీ 50 శాతం మొత్తాన్ని మాత్రమే చెల్లించారు. అది కూడా రెండు విడతల్లో కావడం గమనార్హం.
ఒకవైపు వేతనాలు ఇవ్వకుండా మరోవైపు వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి ఒకేసారి సెటిల్‌మెంట్ చేయకుండా ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. బకాయిల కోసం వారు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదు. పైగా ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటూ ఇటీవల సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తద్వారా సీŠట్‌ల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల పట్ల ఆయనలో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టమవుతోంది.
ప్రైవేటీకరించం అంటూనే...
స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించం అని ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు చెబుతూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయసాగారు. తొలుత ఉద్యోగులకు నెలల పాటు జీతాలు ఇవ్వకుండా వేధించారు. 25 శాతం, 50 శాతమే ఇచ్చారు. తర్వాత తొలి విడత వీఆర్‌ఎస్ ప్రవేశపెట్టారు. 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ఉద్యోగులు, కార్మికుల నుంచి భారీగా వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా రెండో విడత వీఆర్‌ఎస్ తెచ్చింది.
ప్లాంట్‌లోని కీలకమైన 46 విభాగాలను గుర్తించి ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఇందులో 32 విభాగాల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను (ఈవోఐ) ఆహ్వానించారు. రెండువారాల క్రితం ఏకంగా ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్‌ఎంఎస్–1లో కోల్ కెమికల్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ) సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానించారు. ఇక మూడో విడత వీఆర్‌ఎస్ ద్వారా ఉద్యోగులను పూర్తిగా సాగనంపేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతోంది.
ప్రైవేటీకరణ కుట్రలో భాగమే ఇది..
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే దిశగా అన్ని అడుగులు పడుతున్నాయి. ఉద్యోగులు ఇక్కడ పనిచేయడం కష్టమని భావించేలా జీతాలు బకాయి పెట్టారు. ఆపరేషన్స్ విభాగాన్ని అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానించారు. మూడో విడత వీఆర్‌ఎస్‌తో ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోనుంది. ఇప్పటికే సంఖ్య తక్కువ ఉంది. ఇంకా తగ్గించడం ద్వారా ఉన్నవారిపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వారు కూడా ఉద్యోగాన్ని వదిలివెళ్లేలా చేస్తున్నారు. – మంత్రి రాజశేఖర్, చైర్మన్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ


