స్వదేశానికి తెలుగు విద్యార్థులు | Sakshi
Sakshi News home page

స్వదేశానికి తెలుగు విద్యార్థులు

Published Sun, Feb 27 2022 3:43 AM

Telugu students returns for their home country - Sakshi

సాక్షి, ముంబై/అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల్లో కొందరు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకున్నారు. ఈ విమానంలో 10 మంది ఏపీకి చెందిన విద్యార్థులు, 15 మంది తెలంగాణ వారున్నారు. వీరి కోసం ముంబై ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌డెస్క్‌ సభ్యులు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నామంటూ విద్యార్థులు ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తామంతా ఉక్రెయిన్‌లోని పశ్చిమ భాగంలో ఉండటంతో పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదని వారు ‘సాక్షి’కి వివరించారు.

వీరున్న ప్రాంతంలో బాంబు దాడులు జరగనప్పటికీ ప్రస్తుతం నెలకొన్న యుద్ధంవల్ల తాము కొంత భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై దాడుల అనంతరం తమ విశ్వవిద్యాలయం అధికారులు స్వదేశానికి వెళ్లేందుకు ఎంతో సహకరించారని, అదేవిధంగా భారత రాయబార కార్యాలయం కూడా తమను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లుచేసిందని విద్యార్థులు తెలిపారు. అయితే, విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పశ్చిమం వైపున్న రొమేనియాకు బస్సుల్లో తరలించి, సుమారు ఐదారు గంటల ప్రయాణం అనంతరం అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్నట్లు వెల్లడించారు.
ముంబై ఎయిర్‌ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఏపీ అధికారులు   

ఇక్కడికి చేరుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్‌లో బస ఏర్పాటుచేసి భోజన ఏర్పాట్లుచేసింది. నవీ ముంబై తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి, అడిషనల్‌ కమిషనర్‌ (ముంబై కస్టమ్స్‌) మెరుగు సురేష్, అసిస్టెంట్‌ కమిషనర్‌ (కస్టమ్స్‌) ఎం. నాగరాజు, రవిరాజు, చంద్రశేఖర్‌ తదితర అధికారులతో పాటు ఎన్జీవో సంస్థకు చెందిన కూరపాటి నరేష్‌ తదితరులు ఏపీ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సహకరించారు. మరోవైపు.. ముంబై నుంచి ఈ విద్యార్థులను వారివారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. 

ముంబై చేరుకున్న ఏపీ విద్యార్థులు వీరే..
కావ్యశ్రీ (విజయవాడ), కొండమర్రి ప్రవీణ్‌ (చిత్తూరు జిల్లా), అల్లాడి నాగ సత్య హర్షిణి (చిత్తూరు జిల్లా), రాజనాల సుష్మ (కాకినాడ), చల్లా సుదార్‌ సోమ (కాకినాడ), షేక్‌ రీను (ఆళ్లగడ్డ), జంబుగోళం పావని (తిరుపతి), దరువూరి సాయిప్రవీణ్‌ (గుంటూరు), వెన్నెల వర్ష (పొట్నూరు, శ్రీకాకుళం జిల్లా), గాధంశెట్టి గోపిక వర్షిణి (తిరుపతి). వీరంతా ఆదివారం వారి స్వస్థలాలకు చేరుకుంటారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement