Telangana High Court: ప్రాంతీయతత్వంతో... ప్రజల ప్రాణాలు తీస్తారా?

Telangana High Court is angry over TS Govt For Stopping AP ambulances - Sakshi

జీవించే హక్కును కాలరాసే అధికారం మీకెవరిచ్చారు? ఏపీ అంబులెన్సులను నిలిపేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని స్పష్టీకరణ

మరోసారి ఇలాంటి ఉత్తర్వులివ్వవద్దు

సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తెలంగాణ సర్కార్‌ ఉల్లంఘించింది

కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశం

విచారణ జూన్‌ 17కు వాయిదా 

కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సరిహద్దుల్లో అనుమతి

నచ్చిన చోట వైద్యం.. ప్రజల హక్కు
రాష్ట్ర ప్రభుత్వ (తెలంగాణ) వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకే ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్‌ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా ప్రశ్నించాం. దానర్థం ఏదో ఒక సర్క్యులర్‌తో అంబులెన్స్‌ల ప్రవేశాన్ని అడ్డుకోవాలని కాదు కదా? అంబులెన్స్‌లను ఆపవద్దంటూ ఈనెల 11న మేం ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ ఆర్టికల్‌ 14, 21కి విరుద్ధం. ప్రభుత్వ నిర్ణయం పూర్తి వివక్షా పూరితంగా ఉంది. కేంద్రం నుంచి అనుమతి లేకుండా జాతీయ రహదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం నేరం. తమకు నచ్చిన చోట సకాలంలో వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకునే హక్కును ప్రజలకు రాజ్యాంగం కల్పించింది.
    – తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

► కరోనా బాధితుడైన తిరుపతికి చెందిన అబ్దుల్లా (38)ను ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా తెల్లవారుజామున 5.30 గంటలకు కర్నూలు జిల్లాలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఎంత ప్రాధేయపడ్డా వినిపించుకోకపోవడంతో వెనుదిరిగారు. ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి చొరవతో  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరారు. 

► కరోనాతో కర్నూలులో చికిత్స పొందుతున్న ఆస్పరికి చెందిన రామలింగ(56)కు శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్లుండి చేయి కదలకపోవడంతో న్యూరో సమస్య తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. ఐదు గంటల్లో ఆపరేషన్‌ చేయాలని, వెంటనే హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఉదయం ఏడు గంటలకే క్యూలో 22కు పైగా వాహనాలున్నాయి. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ఫోన్‌ చేయించి వాట్సాప్‌లో లేఖ తెప్పిస్తే గానీ తెలంగాణ పోలీసులు అంబులెన్సును అనుమతించలేదు. 

సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్‌: కరోనా రోగులతో ఉన్న అంబులెన్స్‌లను ఆపవద్దంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వాటిని సరిహద్దుల్లో నిలిపివేయడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ను కలిపే జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయని, కేంద్రం ముందస్తు అనుమతి లేకుండా అంబులెన్స్‌లను ఆపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈనెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ ఉందని స్పష్టం చేసింది.

ముందస్తు అనుమతి లేకుండా వచ్చే అంబులెన్స్‌లను రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేస్తూ ఈనెల 11న ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్‌ రూం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోకి అంబులెన్స్‌ల ప్రవేశానికి సంబంధించిన ఈ సర్క్యులర్‌ను సవరించి మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సరిహద్దుల్లో ఉన్న అధికారులకు వెంటనే తమ ఆదేశాలను తెలియజేసి అంబులెన్స్‌ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని న్యాయస్థానం ఆదేశించింది.  

సరిహద్దుల్లో నిలిపేయటంతో... 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దుల్లోని పలు చెక్‌పోస్టుల వద్ద నిలిపేయటంతో వివాదం మొదలైంది. ప్రాణాలు కాపాడుకుందామని అంబులెన్సుల్లో బయలుదేరిన కోవిడ్‌ రోగుల అంబులెన్సులు గంటల తరబడి రోడ్లపక్కన నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా గరికపాడు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా, గుంటూరు జిల్లా వాడపల్లి వద్ద గురువారం ఆర్థరాత్రి నుంచి ఈ తరహా దారుణ పరిస్థితి నెలకొంది. అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ అయిపోవటం... వెంటనే వెనక్కి తీసుకెళ్లి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చటం వంటివీ జరిగాయి. ఈ పరిస్థితులపై విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకట కృష్ణారావు వేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం అత్యవసరంగా విచారించింది.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌ రోడ్డులో అంబులెన్స్‌లు నిలిపివేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఉదయభాను 

ఈ కేసులో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయి తమ వాదనలు వినిపించింది. అంబులెన్స్‌లను నిలిపివేయడంతో ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే కరోనా రోగులకు వైద్యం అందక మరణించే ప్రమాదం ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించగా... తెలంగాణలోని ఇతర పట్టణాలకు చెందిన కోవిడ్‌ రోగులెవరైనా హైదరాబాద్‌ రావచ్చని, సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే రోగులను మాత్రమే ముందస్తు అనుమతితో, బెడ్‌ లభించాకే అనుమతిస్తున్నామని హైకోర్టుకు తెలంగాణ ఏజీ బి.ఎస్‌.ప్రసాద్‌ ఈ సందర్భంగా చెప్పారు. ‘సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రపదేశ్, చత్తీస్‌ఘడ్‌ నుంచి పెద్ద ఎత్తున కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారు. ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ దొరక్క రోడ్ల మీదే నిరీక్షిస్తుండడంతో వారి ద్వారా కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఆదేశాలలిచ్చాయి. ఆర్టిపీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వస్తేనే రాష్ట్రంలోకి ప్రవేశం కల్పిస్తామని కొన్ని రాష్ట్రాలు ఆదేశాలిచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు’’ అని నివేదించారు. దీనికి  న్యాయమూర్తి స్పందిస్తూ... తమకు నచ్చిన చోట సకాలంలో వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడుకునే హక్కు ప్రజలకు రాజ్యాంగం కల్పించిందని, ఇందుకు విరుద్ధంగా ఆంక్షలు విధించడం దారుణమని పేర్కొన్నారు. 

మా ఆదేశాలకు వక్రభాష్యం... 
‘‘అంబులెన్స్‌లను ఆపవద్దంటూ ఈనెల 11న మేం ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. ఎపిడమిక్స్‌ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద ఈనెల 11న రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్‌ జారీచేసింది. అయితే ఈ రెండు చట్టాలు రాష్ట్రంలోకి కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని నిషేధించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ ఆర్టికల్‌ 14, 21కి విరుద్ధం. అహ్మదాబాద్‌లో ప్రభుత్వ అంబులెన్స్‌లో వచ్చే వారినే అడ్మిట్‌ చేసుకోవాలని, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆసుపత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల అడ్మిషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రాన్ని ఆదేశించింది. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగులతో ఉన్న అంబులెన్స్‌లకు రాష్ట్రంలోకి ప్రవేశం కల్పించడం దారుణం.

రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలను తీస్తారా? రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాల ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా? అంటూ ఒకానొక దశలో ధర్మాసనం మండిపడింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ... రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశింశారు. తదుపరి విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది. నిజానికి న్యాయస్థానం ఆదేశించినా రాత్రివరకూ అంబులెన్సులను అలాగే నిలిపేసిన పోలీసులు... చివరకు రాత్రి 10 గంటల సమయంలో తెలంగాణలోకి ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను అనుమతించారు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి వాహనాలను అనుమతించడం మొదలైందని శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్‌ తెలిపారు. ఈ మేరకు అన్ని సరిహద్దు జిల్లాల ఎస్పీలకు ఫ్యాక్స్‌ ద్వారా సందేశం పంపామన్నారు.  

సమంజసం కాదు.. 
తెలంగాణ సీఎస్‌కు ఆదిత్యనాథ్‌ దాస్‌ ఫోన్‌ 
జాతీయ రహదారులపై ఆంక్షలు లేవని, అత్యవసర సేవలందించే అంబులెన్స్‌లను ఎలా అడ్డుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌ తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేశారు. తాము అంబులెన్స్‌లను నిలుపుదల చేయడం లేదని, రెగ్యులేట్‌ చేస్తున్నామని తెలంగాణ సీఎస్‌ పేర్కొనగా, ఆ పేరుతో నిలుపుదల చేస్తున్నారని, అత్యవసర వైద్య సేవలందించే అంబులెన్స్‌లను ఆపడం సమంజసం కాదని ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టం చేశారు.

పెద్ద నగరాలు తలుపులు మూసేస్తే ప్రజలెక్కడికి వెళ్లాలి?
ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్క్యులర్‌ అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. నివాస ప్రాంతం ఆధారంగా రాష్ట్రంలోకి కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమేనన్నారు. ‘‘కంట్రోల్‌ రూం నుంచి ముందస్తు అనుమతి కావాలని జాప్యం చేస్తే సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ  ప్రభుత్వ ఉత్తర్వులు ఈ–మెయిల్‌ ద్వారా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేశారు. కరోనాతో ప్రపంచమే యుద్ధం చేస్తున్న తరుణంలో ముందస్తు అనుమతి, ప్రాంతీయ భావంతో కరోనా రోగుల ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు.  

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ శ్రేణి (టైర్‌ –1) నగరాలు ఏవీ లేవని ఏజీ స్పష్టం చేశారు. ‘‘2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. దీనిపై రెండు రాష్ట్రాలకూ హక్కు ఉంటుంది. అయినా పెద్ద నగరాలు తలుపులు మూసేస్తే చుట్టుపక్కలున్న ఇతర రాష్ట్రాల పరిస్థితేంటి? ఢిల్లీ గనక తమ నగరంలోకి కోవిడ్‌ రోగులు రావద్దని సరిహద్దులు మూసేస్తే చుట్టుపక్కలు పంజాబ్, హరియాణా, యూపీ లాంటి రాష్ట్రాల ప్రజల పరిస్థితి  ఏం కావాలి? సదుపాయాలు బాగుంటాయనే టైర్‌ –1 నగరాలకు వెళతారు కదా?’ అని ఏజీ నివేదించారు.

ఆక్సిజన్‌ సిలిండర్లు తెప్పించిన కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప
బళ్లారి నుంచి వచ్చిన ఇద్దరు కరోనా పేషెంట్లకు సీరియస్‌గా ఉండటంతో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప తక్షణమే స్పందించారు. పోలీసు వెల్ఫేర్‌ ఆస్పత్రి నుంచి ఆక్సిజన్‌ సిలిండర్లను తెప్పించి మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం సాయంత్రం పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేసిన ఓ అంబులెన్సులో ఆక్సిజన్‌ చివరి దశలో ఉన్నట్లు ఎస్పీ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి స్వయంగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేసి ప్రాణాలను కాపాడారు. అక్కడ నిలిపివేసిన పలు అంబులెన్స్‌ల్లో రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి కూడా వాకబు చేశారు. తెలంగాణ నుంచి కర్నూలులోని వివిధ హాస్పిటళ్లకు రోజూ పెద్ద ఎత్తున కరోనా పేషెంట్లు వస్తున్నారని, వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తాజాగా తెలంగాణ నుంచి వచ్చిన నలుగురికి సీరియస్‌గా ఉండడంతో హాస్పిటల్‌లో చేర్పించామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top