‘మూల్యం’ చెల్లించుకోవాల్సిందే! | Teachers will be punished if mistakes are made in evaluation of answer sheets: AP | Sakshi
Sakshi News home page

‘మూల్యం’ చెల్లించుకోవాల్సిందే!

Mar 24 2026 5:27 AM | Updated on Mar 24 2026 5:27 AM

Teachers will be punished if mistakes are made in evaluation of answer sheets: AP

మూల్యాంకనంలో తప్పులు జరిగితే ఉపాధ్యాయులకు శిక్షలు 

భారీగా జరిమానాలు నిర్దేశించిన విద్యాశాఖ  

సర్విస్‌ పాయింట్లు కోత.. ఇంక్రిమెంట్లూ నిలిపివేత 

ఏప్రిల్‌ 4 నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం 

చంద్రబాబు సర్కారు ఆదేశాలపై ఉపాధ్యాయుల ఆందోళన  

మూల్యాంకనం విధులకు వెళ్లేందుకు విముఖత  

సాక్షి, అమరావతి: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఉపాధ్యాయులకు సంకటంగా మారింది. మూల్యాంకనంలో జరిగే పొరపాట్లకు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు గురువుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్పాట్‌ వాల్యుయేషన్, రీ–కౌంటింగ్‌ లేదా రీ–వెరిఫికేషన్‌ ప్రక్రియల్లో సిబ్బంది నిర్లక్ష్యం కనిపించినా, మార్కుల్లో వ్యత్యాసం వచ్చినా లేదా ఉల్లంఘన జరిగినట్టు తేలినా శిక్షలు ఉంటాయని సర్కారు హెచ్చరించడంపై సర్వత్రావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గితే సబ్జెక్టు టీచర్లపై చర్యలు తీసుకుంటామని ఇటీవల సర్కారు హెచ్చ­రించగా, తాజాగా మూల్యాంకన శిక్షలు ప్రకటించడంతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు.  

మార్కుల్లో తేడాను బట్టి భారీ జరిమానాలు 
ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు (ఎస్‌ఎస్‌సీ–2026) జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 2తో పరీక్షలు ముగుస్తాయి. 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో మార్కుల్లో తేడా గుర్తిస్తే నగదు జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  మూల్యాంకనంలో ఒక సబ్జెక్టు ఫెయిల్‌ అని ప్రకటించి, తర్వాత జరిగే తనిఖీల్లో పాస్‌ అయినట్టు గుర్తిస్తే మార్కుల తేడాను అనుసరించి జరిమానాలు విధించనున్నట్టు ప్రకటించింది.

1 నుంచి 5 మార్కులు తేడా వస్తే రూ.4 వేలు, 6 నుంచి 10 మార్కులకు రూ.4,500, 11 నుంచి 20 మార్కులకు రూ.5వేలు, 21 నుంచి 30 మార్కులకు రూ.5,500, 31 ఆపైన మార్కులు తేడా ఉంటే రూ.6 వేలు చొప్పున చీఫ్‌ ఎగ్జామినర్‌కు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు ఆవే మార్కుల తేడాకు రూ.2 వేలు, రూ.2,500, రూ.3 వేలు, రూ.3,500, రూ.4 వేలు చొప్పున, స్పెషల్‌ అసిస్టెంట్లకు రూ.1,500, రూ.2 వేలు, రూ.2,500, రూ.3 వేలు, రూ.3,500 చొప్పున జరిమానాలు విధిస్తారు. దీంతోపాటు ఉపాధ్యాయుల బదిలీల్లో వీరికి సర్విస్‌ పాయింట్లు 0, 0, 0.5, 1, 2 పాయింట్లు తగ్గిస్తారు. అలాగే, వార్షిక ఇంక్రిమెంట్‌ కూడా నిలిపివేస్తామని సర్కారు ప్రకటించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.    

సర్విస్‌ పాయింట్లు కోత..  
పాస్‌ టు పాస్, ఫెయిల్‌ టు ఫెయిల్‌ చూపించిన సందర్భంలో మార్కుల తేడాలు గుర్తించినా సరే జరిమానాలు విధిస్తారు. ఈ విధానంలో 1 నుంచి 5 మార్కులు తేడా ఉంటే ఎలాంటి జరిమానా ఉండదు. కానీ 6 నుంచి 10 మార్కులు తేడా వస్తే రూ.­2 వేలు, 11 నుంచి 20 మార్కుల తేడాకు రూ.­2,5­00, 21 నుంచి 30 మార్కుల తేడాకు రూ.3వేలు, 31 ఆపైన మార్కులు వరకు తేడా ఉంటే రూ.3,500 చీఫ్‌ ఎగ్జామినర్‌కు విధిస్తారు, అలాగే, అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు 0, రూ.1,000, రూ.1,500, రూ.2 వేలు, రూ.2,500 చొప్పున, స్పెషల్‌ అసిస్టెంట్లకు 0, రూ.500, రూ.1,000, రూ.1,500, రూ.2వేలు చొప్పున జరిమానా విధిస్తారు.

అలాగే, బదిలీల్లో వీరికి సర్విస్‌ పాయింట్లలో కూడా కోత పెడతారు. చివరిగా వార్షిక ఇంక్రిమెంట్‌ కూడా నిలిపివేస్తామని ఆదేశాల్లో విద్యాశాఖ స్పష్టం చేసింది.. దీంతో మూల్యాంకనం విధులకు వెళ్లడానికి ఉపాధ్యాయులు వెనకడుగు వేస్తున్నారు. దీనికంటే స్కూళ్లల్లోనే పాఠాలు చెప్పుకోవడం ఉత్తమమని వాపోతున్నారు. స్పాట్‌ విధానంలో సంస్కరణలు అవసరమేగాని, సంస్కరణల పేరుతో ఒత్తిడికి గురి చేయడం ఏంటని ప్రశి్నస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement