Tirupati Bypoll 2021: తిరుపతిలో టీడీపీ డీలా

TDP is worried about Tirupati by-election - Sakshi

వరుస ఓటములతో కేడర్‌లో నిర్వేదం

సాక్షి, అమరావతి: వరుసగా ఎదురైన ఘోర పరాజయాల నేపథ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై టీడీపీలో ఆందోళన నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికను ఎదుర్కోవడం కష్టమని పార్టీ శ్రేణులు, నాయకులు అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైనా నేతలు ఎవరూ ఆ ఊసే ఎత్తడంలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో టీడీపీలో నిర్వేదం ఏర్పడింది.

అంతకుముందు పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీ యంత్రాంగం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కుదేలైపోవడంతో ఆ పార్టీ కేడర్‌ డీలా పడిపోయింది. అచ్చెన్నాయుడుతోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనూ ఎటువంటి ప్రభావం చూపించలేక చతికిలపడింది. అనుకూల మీడియాలో హడావుడే తప్ప పార్టీపట్ల ప్రజల్లో ఆదరణలేదన్న విషయం పంచాయతీ ఎన్నికల్లోనే స్పష్టమైనట్లు పార్టీ సీనియర్‌ నాయకులు విశ్లేషించారు.

చంద్రబాబు చేసే ఉద్యమాలు కూడా ప్రజలకు సంబంధించినవి కాకుండా తన సొంత ప్రయోజనాలున్న అమరావతి రాజధాని వ్యవహారం, పార్టీ నేతలకు సంబంధించినవే ఎక్కువ ఉండడంతో జనంలో ఉన్న ఆదరణ తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు సంయమనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడడంతో పార్టీ పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. ఈ తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక రావడంతో ఏం చేయాలో టీడీపీ నేతలకు అంతుపట్టడంలేదు.

ఒకవైపు ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా కోలుకోకపోవడం, మరోవైపు అవినీతి కేసులు చుట్టుముట్టడంతో ఓ రకంగా చంద్రబాబు కూడా నిర్వేదానికి లోనైనట్లు పార్టీలో  ప్రచారం జరుగుతోంది. అందుకే తిరుపతి ఉప ఎన్నికకు నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ప్రకటించినా అది మొక్కుబడేనని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయాల భారంతో తీవ్రంగా కుంగిపోయిన చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కూడా ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేమని చర్చించుకుంటున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top