కూల్‌డ్రింక్‌ కంటే.. బీరే మంచిది! | TDP MLA Palla Srinivasa Rao Sparks Controversy Over Remarks Comparing Beer And Soft Drinks | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్‌ కంటే.. బీరే మంచిది!

Jun 29 2026 7:38 AM | Updated on Jun 29 2026 10:18 AM

TDP Palla Srinivas Says Beer is Better Than Cool Drink

సాక్షి, గాజువాక: కూల్‌డ్రింక్‌ కంటే బీరే మంచిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీచ్‌ల్లో ఏర్పాటు చేస్తున్న బీచ్‌ షాక్స్‌ (మద్యం షాపులు) మంచివేనని.. అవి చెడ్డవని చెప్పడానికి ఏమీ లేదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూల్‌డ్రింక్‌ కంటే బీరులోనే తక్కువ కేలరీలు ఉంటాయన్నారు. 

బీరుతో పోలిస్తే కూల్‌డ్రింక్‌లోనే చక్కెర ఎక్కువని తెలిపారు. తాను ఇలా మాట్లాడితే బీరు తాగడాన్ని ప్రోత్సహించడానికి మాట్లాడుతున్నానని అనుకుంటారన్నారు. ప్రత్యేక ప్రాంతాల్లో బీచ్‌ షాక్స్‌తోపాటు ఇతర పర్యాటక సదుపాయాలు ఏర్పాటు చేస్తే విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు. కూల్‌డ్రింకులతో పోలిస్తే బీరులోనే చక్కెర, క్యాలరీల శాతం తక్కువగా ఉంటుందన్నారు. బీచ్‌ల్లో బీచ్‌ షాక్స్‌ పేరిట మద్యం షాపులు ఏర్పాటు చేయడం మంచిదేనని, దానివల్ల సంస్కృతి దెబ్బతినదన్నారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూనే మోడరన్‌ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 

నెటిజన్ల ఆగ్రహం.. 
‘ధూమపానం.. మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని సినిమాకు ముందు ప్రకటన వేస్తుంటారు. బహిరంగ ప్రదేశాల్లో సైతం రాసి బోర్డులు పెడుతుంటారు. కానీ ఇదంతా అబద్ధమని, కూల్‌ డ్రింక్స్‌ కంటే బీర్లు మంచివని, మద్యపానాన్ని ప్రోత్సహించేలా బీచ్‌ సాక్స్‌ ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమంలో ప్రజలు చివాట్లు పెడుతున్నారు. ‘కూల్‌డ్రింక్స్‌ కంటే బీరులో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది‘ అని టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యపానాన్ని ప్రోత్సహించేలా బాధ్యాతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడటం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.  

పోషకాహార గణాంకాల ప్రకారం, 330 మి.లీ. సాధారణ కూల్‌డ్రింక్‌లో 35–40 గ్రాముల చక్కెర ఉండగా, అదే పరిమాణంలో సాధారణ బీరులో 0–3 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అంతమాత్రాన బీరు ఆరోగ్యకర పానీయం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫెర్మెంటేషన్‌ సమయంలో చక్కెరలో అధిక భాగం ఆల్కహాల్‌గా మారిపోవడమే బీర్‌లో చక్కెర శాతం తక్కువగా ఉండటానికి కారణం. అదే విధంగా 330 మి.లీ. బీరులో సుమారు 140–160 కిలో క్యాలరీలు, 10–13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, దాదాపు 5 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. కూల్‌డ్రింక్‌లో సుమారు 135–145 కిలో క్యాలరీలు ఉన్నప్పటికీ, ఆల్కహాల్‌ ఏమాత్రం ఉండదు. షుగర్‌ తగ్గిందని చెబుతున్న ఎమ్మెల్యే, అదే చక్కెర ఆల్కహాల్‌గా మారిన విషయాన్ని ప్రస్తావించకపోవడం ప్రజలకు తప్పుడు సందేశం ఇవ్వడమేనని సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆల్కహాల్‌ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయ వ్యాధులు, అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె సంబంధిత సమస్యలు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఎందుకు దాచిపెడుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement