
నెల్లూరు (పొగతోట): ‘తల్లికి వందనం’ కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే ఇస్తారా? కార్పొరేట్ పాఠశాలల్లో చదివే వారికి ఇవ్వరా? అని టీడీపీ కావలి ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి అధికారులను నిలదీశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీచైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగింది.
వివరాల ప్రకారం.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సమావేశంలో ‘తల్లికి వందనం పథకం’పై కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలంలో ఒకే పాఠశాలలో 50 మంది విద్యార్థులకు పైగా ‘తల్లికి వందనం’ అందలేదని విద్యాశాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో కావలి నియోజకవర్గం నుంచే 1,100 మందికి పైగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ‘తల్లికి వందనం’ అందలేదని మంత్రి ఎదుటే టీడీపీ ఎమ్మెల్యేనే ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. దీనిపై కలెక్టర్ ఆనంద్ సమాధానమిస్తూ విద్యార్థులు పాఠశాలల్లో చేరే సమయంలో పూర్తి వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు.