
ఆయనను గెలిపించి తప్పు చేశాం
టీడీపీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన తెలుగు తమ్ముళ్లు
విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది.
ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్ రాజు, యరబాల అనిల్ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
