కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు

TDP Leader Palla Srinivasa Rao Land Scams Creating Sensation - Sakshi

విశాఖలో ఆక్రమణలపై సిట్‌ వేసింది టీడీపీనే

ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

చంద్రబాబు అండతోనే కబ్జాలు: మంత్రి ముత్తంశెట్టి

భూముల రికార్డులు ఎలా పోయాయి: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖపట్నంలో భూకబ్జాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కుటుంబసభ్యుల చెరలో ఉన్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం నాయకులు గగ్గోలు పెడుతున్నారని మంత్రులు, ప్రజాప్రతినిధులు సోమవారం ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ఆక్రమణదారులు ఎంతటివారైనా వదిలేదిలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. కబ్జాకు గురైన భూముల్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. లోకేశ్‌ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన భూముల విలువే రూ.వెయ్యికోట్లని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ తెలిపారు. మరోవైపు తాను భూములు ఆక్రమించలేదన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. తన తమ్ముడి ఆక్రమణలపై మీడియా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.

అడ్డూఅదుపు లేకుండా ప్రభుత్వ భూముల కబ్జా
విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆనాడు టీడీపీ ప్రభుత్వమే సిట్‌ వేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందన్నారు. ఆనాడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని యథేచ్ఛగా వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కువమంది టీడీపీ నేతలు ఆక్రమణదారులు కావటంతో అప్పటి ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించిందన్నారు.

విశాఖలో టీడీపీ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా సాగాయన్నారు. ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకోవాలన్న కృతనిశ్చయంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విశాఖలో టీడీపీ నేతలు ఆక్రమించినవి ప్రభుత్వ భూములని రికార్డులే చెబుతున్నాయని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం వాటిని న్యాయబద్ధంగా తన ఆధీనంలోకి తీసుకుంటోందన్నారు. టీడీపీ నేతల ఘనకార్యాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్రమిత భూముల గురించి టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని చెప్పారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటే అది కక్షపూరితం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ట్రస్టీగా ప్రజల ఆస్తులను కాపాడటంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

అధికారులు నిగ్గు తేల్చారు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలు, భూకుంభకోణాలకు పాల్పడ్డారని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ఆధీనంలో ప్రభుత్వ భూములున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారని, వాటిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి, అధికారులకు ఉందని చెప్పారు. విశాఖలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి షెడ్‌లను కూల్చేశారని కొందరు టీడీపీ నేతలు ఆక్రమణదారులకు వత్తాసుపలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న రూ.4,776 కోట్ల విలువైన సుమారు 430 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో చేపట్టిన ఆక్రమిత భూముల స్వాధీన మహాయజ్ఞానికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు భూకుంభకోణాలపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని గుర్తుచేశారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్టేట్, ఈనాం భూములను టీడీపీకి చెందిన కొందరు ఆక్రమించుకున్నారని, వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్త కె.కె రాజు, పార్టీ నాయకుడు అక్కరమాని వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కబ్జాకు సూత్రధారి చంద్రబాబే..
విశాఖలో భూదోపిడీ, ప్రభుత్వ భూముల కబ్జాకు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాచేసిన దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన 40 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు. రుషికొండలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు లాంటి వారు ఇప్పుడు తమ సహచరుల్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించుకున్న భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందే తప్ప దీన్లో కక్షసాధింపు ఏమీ లేదన్నారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన రికార్డులు పోయాయని చెబుతున్నారని, అసలు అప్పుడు గాలులే తప్ప లాకర్లలో ఉన్న భూరికార్డులు తడిసిపోయే విధంగా వర్షం పడలేదని చెప్పారు. అప్పటి భూరికార్డులు ఎలా మాయమయ్యాయో చంద్రబాబుకే తెలియాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ అభివృద్ధికి రాత్రిబంవళ్లు పనిచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు.

నేను ఎక్కడా ఆక్రమించలేదు
– టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్నంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పారు. గాజువాక నియోజకవర్గంలోని సర్వే నం.33/4లో తన స్థలం పక్కన ఉన్న రాస్తా తనకు మాత్రమే పనికొస్తుందని, అది ఎవరికీ ఉపయోగపడదని, దాన్ని తనకు అప్పగిస్తే.. బదులుగా ఎక్కడైనా స్థలం ఇస్తానని గతంలోనే దరఖాస్తు చేసుకున్నానని, అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. అధికారులు స్పందించకపోతే.. ఆ భూముల్ని మీరెలా వినియోగించుకుంటారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. సర్వే నం.33/2లో తన స్థలం పక్కన చెరువు బంద ఉందని, దాన్ని తాను ఆక్రమించకుండానే ఆక్రమించేసినట్లు చూపించారని చెప్పారు. చట్టం ప్రకారం కుటుంబ భూముల్లో తన వాటా 1/7 మాత్రమేనన్నారు. తుంగ్లాం రెవెన్యూ గ్రామం పరిధిలో తన సోదరుడు పల్లా శంకరరావు పేరుతో ఉన్న ఆక్రమిత భూముల స్వాధీనంపై మాత్రం పల్లా శ్రీనివాసరావు నోరు మెదపకుండానే మీడియా సమావేశం ముగించేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top