
ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల గూండాగిరీ
సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యకాండ
అరుపులు, కేకలతో అరాచకం.. మీడియా ప్రతినిధులపైనా రుబాబు
సాక్షి, పుట్టపర్తి/పెనుకొండ రూరల్: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అరాచకీయాలు పెచ్చుమీరుతున్నాయి.శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండల పరిధిలోని కియా కార్ల పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల కోసం ఆమె అనుచరులు, టీడీపీ నేతలు గూండాగిరికి దిగారు. మంగళవారం పరిశ్రమ వద్ద దౌర్జన్యం చేసి భయానక వాతావరణం సృష్టించారు. మంత్రి ఆదేశాలతో భారీసంఖ్యలో అక్కడికి చేరుకుని.. కాంట్రాక్టు పనులన్నీ తమకే ఇవ్వాలంటూ అరుపులు, కేకలతో రెచ్చిపోయారు. యాజమాన్యమూ భయభ్రాంతులకు గురయ్యేలా దాదాపు నాలుగు గంటలపాటు గొడవ చేశారు.
పెనుకొండ మండలం దుద్దేబండ రోడ్డులో కియా అనుబంధ పరిశ్రమ ‘సంఘు హైటెక్’ ఉంది. ఇక్కడ విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) తయారు చేసి ప్రధాన పరిశ్రమలోకి పంపుతుంటారు. ఇక్కడి మ్యాన్‌పవర్ ఏజెన్సీ, క్యాంటీన్, స్నాక్స్ కాంట్రాక్టులపై మంత్రి అనుచరుల కన్ను పడింది. ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి తమకే ఇవ్వాలని పరిశ్రమ అధికారులపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పది గంటలకు పెనుకొండ టౌన్, రూరల్, గుట్టూరు, రాంపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు సుమారు వంద మంది పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ ప్రధాన గేటు ముందు అడ్డుగా నిలబడ్డారు.
కియా ప్రధాన పరిశ్రమలోకి విడిభాగాలు తీసుకెళ్లే కంటైనర్ వాహనాలను అడ్డగించారు. పరిశ్రమ హెచ్‌ఆర్ మేనేజర్లు సంప్రదింపుల కోసం పది మందిని కార్యాలయంలోకి పిలిచినప్పటికీ వెళ్లలేదు. వారే తమ వద్దకు రావాలంటూ ఈలలు, కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. బయట పరిస్థితిని గమనించిన పరిశ్రమ హెచ్‌ఆర్ మేనేజర్లు కనీసం గేటు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మంత్రి అనుచరుల దౌర్జన్యం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న కియా స్టేషన్ ఎస్‌ఐ రాజేష్, ఒక కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. ఎస్‌ఐ రాజేష్ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించారు. తర్వాత కొందరిని లోపలికి తీసుకెళ్లి మాట్లాడించారు. మరొక్క రోజు గడువు కావాలని వారు కోరినట్లు తెలుస్తోంది.
వైఎస్ జగన్ ఫొటోల తొలగింపు
దౌర్జన్యానికి దిగిన మంత్రి సవిత అనుచరులను పరిశ్రమ ప్రతినిధులు చర్చల కోసం లోపలికి పిలిచారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను మంత్రి అనుచరులు చించివేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కియా కార్ల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది ఆయనతో ఫొటోలు దిగారు. వాటిని కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీలుగా పెట్టుకున్నారు. వాటిని చూసిన ‘పచ్చ’మూక జీరి్ణంచుకోలేకపోయింది. వాటిని చించివేసి నానా హంగామా సృష్టించింది.

‘పచ్చ’మూక పైశాచికత్వాన్ని చూసి కియా సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపైనా దౌర్జన్యం కియా వద్ద పరిస్థితిని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైనా మంత్రి అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఒక్కసారిగా దూసుకొచ్చి సెల్‌ఫోన్లను లాక్కునేందుకు యత్నించారు. అప్పటికే ఎస్‌ఐ రాజేష్ పరిశ్రమలోకి వెళ్లగా.. బయట ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉన్నారు. ఆ కానిస్టేబుల్ దౌర్జన్యకారులను నిలువరించే సాహసం చేయలేకపోయారు.
శ్రుతి మించిన ఆగడాలు
పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరుల ఆగడాలు శ్రుతిమించాయి. అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ కాంట్రాక్టులు, దందాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. పరిశ్రమల నిర్వాహకులనూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇటీవలే దుద్దేబండ మలుపు వద్ద కంటైనర్లపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే కియా ‘సంఘు హైటెక్’ వద్ద అలజడి సృష్టించారు.