
రాజా సాహెబ్ గారి బిడ్డ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. ఆమె దృష్టిలో పడడమే గొప్ప.. ఆమెతో ఫోటో దిగడమే మహా అదృష్టం.. ఆమెను ఏదైనా ప్రోగ్రాముకు పిలిస్తే ఆమె వచ్చి కొన్ని క్షణాలు అక్కడ నిలబడితే జీవితం ధన్యమైనట్లు భావిస్తున్న రోజులివి. అలాంటి కాలంలో ఒక చిన్న కార్యకర్త.. పేరు ఊరులేని సాధారణ క్యాడర్ ఏకంగా ఫ్లెక్సీ సాక్ష్యంగా ఎమ్మెల్యే పరువును నడిరోడ్డుమీద నిలబెట్టేశాడు.
ఎమ్మెల్యే గారు.. మీరు గెలిచి ఏడాది దాటింది.. ఇంతకూ మీరు ప్రజలకు ఏం చేశారు చెప్పండి.. అసలు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనుల లిస్ట్ ఇదిగో చూడండి అంటూ ఎండగట్టేసాడు. మీ పనితీరు ఏం బాలేదు.. మీ ప్రోగ్రెస్ కార్డులో సున్నా మార్కులు వేస్తున్నా అంటూ బెత్తంతో కొట్టినట్లు చెప్పాడు. ఈ అంశం ఇప్పుడు స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు అయిన అశోక్ గజపతిరాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, విజయనగరం నుంచి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం అయితే గెలిచారు కానీ ఆమెకు పట్టణం మీద గ్రామీణ నియోజకవర్గ మీద ఎలాంటి పట్టులేదు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే వెళ్లడం ఫోటోలు దిగి రావడం మినహా పట్టణ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఆమెకు ఆమె తండ్రికి మంచి పలుకుబడి ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి కోసం ఆమె ఏమీ చేయడం లేదన్నది ప్రజలకు అర్థమైంది. దీంతోపాటు కార్యకర్తల విషయంలో కూడా ఆమె పెద్దగా ఆసక్తికరంగా లేరని వారి భావన.
అయినా సరే అశోక్ గజపతిని, ఆయన కుమార్తె అదితి గజపతిని ఎవరు ప్రశ్నించే ధైర్యం చేయలేరు. కానీ విజయనగరానికి చెందిన 28వ డివిజన్ కార్యకర్త తీగల ఆనందరావు అదితి గజపతి పరుగును ఫ్లెక్సీకి ఎక్కించాడు. రాజీవ్ నగర్ కాలనీలో మీరు చేయాల్సిన పనులు లిస్ట్ ఇది.. మీరు గెలిచి ఇన్నాళ్లు అయింది ఏ ఒక్క పని అయినా చేశారా?. దీని కోసమేనా మిమ్మల్ని ఎన్నుకున్నది అంటూ ఆయన పనుల జాబితాతో పాటు ప్రశ్నల పరంపరతో అదితిపై విరుచుకుపడ్డారు. సోమవారం కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ తమ నాయకురాలు అసమర్థతను వీధిలో నిలబెట్టారు. అదితి విధేయులకు ఇది కాస్త ఇబ్బందిగా అనిపించినా ప్రజలు.. ఇతర కార్యకర్తలకు మాత్రం ఆనందరావు హీరోలా కనిపించాడు. ఎవరు ప్రశ్నించకపోయినా ఆయన మాత్రం గొంతు ఎత్తాడు.. అదితి పరువు నడివీధిలో నిలబెట్టారు అంటూ లోలోన సంబరపడుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న.